NTV Telugu Site icon

Minister PeddiReddy: 33 ఏళ్లలో కుప్పానికి టీడీపీ ఏం చేసింది?

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. 33 ఏళ్ళలో ఎన్నిసార్లు చంద్రబాబు కుప్పానికి వచ్చారో చెప్పాలన్నారు. పోనీ గత మూడేళ్లలో ఎన్నిసార్లు వచ్చారో చెప్పగలరా అని చంద్రబాబును నిలదీశారు. 15 సార్లు పర్యటించి తమపైన తిట్టేపని తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కుప్పంలో చంద్రబాబు దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నాడని.. అది జరగని పని అని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతీసారి అది బ్లాక్ డే అన్నారు. చంద్రబాబు మళ్లీ కుప్పంలో గెలిచేది కేవలం కలలో మాత్రమేనని అన్నారు.

Read Also: Japan : యువతను మందు కొట్టమని ప్రోత్సహిస్తున్న సర్కార్

రాయలసీమకు తీరని అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసే తాము ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. తనతో పాటు త అధినేతకు రకరకాల పేర్లు పెట్టి చంద్రబాబు శునకానదం పొందుతున్నాడని మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ నేతలే దౌర్జన్యం చేస్తే చంద్రబాబు బురద తమపై చల్లుతున్నాడని ఆరోపించారు. రాజకీయాల్లో మామను వెన్నుపోటు పొడిచిన ఒక శుంట చంద్రబాబు అన్నారు. ఆయన ప్రపంచంలోనే పనికిమాలిన నాయకుడు అని విమర్శించారు. సీఎంను, డీజీపీని, తనను రమ్మని సవాల్ విసురుతూ తన స్ధాయికి దిగజారి మాట్లాడుతున్నాడని.. వైసీపీ నేతలకు తమ ఇళ్లపై జెండాలు కూడా ఏర్పాటు చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ పెంపు కోసం చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడారేమో అనిపిస్తుందన్నారు. కుప్పం ప్రజలపై చంద్రబాబుకు గౌరవం లేదని పెద్దిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లలో గెలిచేది తామేనని జోస్యం చెప్పారు. టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే తాము చూస్తూ ఊరుకునేది లేదని.. తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గానికి తమ ప్రభుత్వం 10వేల ఇళ్లు కేటాయించిందని.. పంచాయతీలకు రూ.66 వేల కోట్ల నిధులు ఇచ్చిందని.. గత 33 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.