టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు.
తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందాలా? మిగతా ప్రాంతాల వారు విదేశాలకు పోవాలా? అని ప్రశ్నించారు. అమరావతి ఒక్కటే అభివృద్ధి అంటే అది రియల్ ఎస్టేట్ అవుతుందన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని నిలదీశారు. పోలవరంలో కమీషన్ల కోసం టీడీపీ నేతలు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో రైతులకు ఎస్ఈజెడ్ భూములు తిరిగి ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత తమదేనని.. రైతులకు ఉచిత పంటల బీమా చేయించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని కన్నబాబు పేర్కొన్నారు.
