ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు స్పందించగా.. తాజాగా మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలన్నారు. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లు ఎలా అవుతుందని హీరో నానిని మంత్రి కన్నబాబు సూటిగా ప్రశ్నించారు.
Read Also: ఉన్న సమస్యలను వదిలేసి.. సినిమా టిక్కెట్లపై పడ్డారు: బుద్ధా వెంకన్న
మరోవైపు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపైనా మంత్రి కన్నబాబు ఆరోపణలు చేశారు. అశోక్ గజపతిరాజు ఏమైనా దైవాంశ సంభూతుడా అని ప్రశ్నించారు. గర్భగుడిలోనే దేవాదాయశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా అశోక్ గజపతి రాజు మాట్లాడారని… ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం ఎంతవరకు సరైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ గజపతిరాజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం.. తిరిగి తమపై ఆరోపణలు చేయడం తప్పు అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు కోసం అధికారులు ప్రొటోకాల్ పాటించారని.. 40 ఏళ్లుగా రామతీర్థం ఆలయాన్ని అశోక్ గజపతి రాజు ఎందుకు అభివృద్ది చేయలేదని నిలదీశారు. ఉత్తర కుమారుడి లాగా లోకేష్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. రైతుల ఆత్మహత్యలను దాయాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలన కంటే వందరెట్లు ఎక్కువగా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
దేశంలో సిగ్గు లేని నాయకుడు ఎవరని ఓటింగ్ పెడితే ఒకటి నుంచి 10 స్థానాలు చంద్రబాబుకే వస్తాయని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. రైతులను మోసం చేయబట్టే చంద్రబాబును ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినట్లు 23 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
