NTV Telugu Site icon

Jogi Ramesh: ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం జన్మించిన టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంది. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా రాజకీయాల్లో ముందడుగు వేయనుంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంది. అయితే బీఆర్ఎస్‌పై మంత్రి జోగి రమేష్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటారని.. వాళ్ళు ఆలోచనలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. మరో 20 ఏళ్ళ పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

కొంత మంది టీఆర్ఎస్ మంత్రులు తమ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే వాళ్ళ నాయకుడి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నారేమోనని.. అందుకే విమర్శలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ చురకలు అంటించారు. బీఆర్‌ఎస్‌ కాదు.. ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేదన్నారు. వైసీపీ పార్టీ ఎవరికీ భయపడదని చెప్పారు. ఏపీ ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.

Read Also: KCR National Party: టీఆర్ఎస్‌.. ఇక బీఆర్ఎస్‌..

అటు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు ఎన్టీవీతో మాట్లాడుతూ.. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు స్థానం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఎలా ముందుకు వెళుతుంది అన్నది ఇంకా చూడాల్సి ఉంటుందన్నారు. కొత్తగా జాతీయ రాజకీయాలు చేయాలి అనుకుంటున్న కేసీఆర్‌కు ఏపీలో రాజకీయంగా స్పేస్ లేదన్నారు. జాతీయ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు. అందుకే ప్రజలు బలమైన ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. టీడీపీ కూడా తమ చేతిలో ఓటమి చవి చూసిందన్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలకు ఆస్కారం లేదని… జాతీయ పార్టీలకు అసలే అవకాశం లేదని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయని.. కుల రాజకీయాలను ప్రజలు అంగీకరించరని మల్లాది విష్ణు పేర్కొన్నారు.