Jogi Ramesh: నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులో జరిగిన ఘటనపై మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. చంద్రన్న కానుక పేరుతో కూపన్లు ఇచ్చి పేదలను ఒకచోటకు చేర్చారని.. కిట్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని కూపన్లు ఇచ్చారు.. ఎంతమందికి పంచారో చెప్పాలన్నారు. సంక్రాంతి పేరు చెప్పి నూతన సంవత్సరంలో పేదల ప్రాణాలు బలితీసుకున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన చూపు అని.. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునుగుతారని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా కిట్లు పంపిణీ చేయాలని చంద్రబాబు చెప్పారని.. ప్రజలు ప్రాణాలు పోయినా ఆయన మాత్రం హైదరాబాదు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
Read Also: Gautham Gambhir: వన్డేల్లో రోహిత్‌కు జోడీగా అతడినే ఆడించాలి
చంద్రబాబుకు సంబంధం లేకపోతే ఈ కిట్లపై చంద్రబాబు ఫోటోలు ఎందుకు వేశారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. తనకు సంబంధం లేదన్న మాటతో తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును, ఆయన పార్టీని నమ్ముకుంటే ఎన్నారైలు నట్టేట మునిగిపోతారని గుర్తుంచుకోవాలన్నారు. అమెరికా నుంచి వచ్చి ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్టు అయ్యారని.. చంద్రబాబు చెప్పినట్లు ఎన్నారైలు చేయవద్దని కోరారు. గోదావరి పుష్కరాలలో 29 మందిని బలితీసుకున్నారని.. కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని బలితీసుకున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ 40 మందిని బలి తీసుకున్నాడని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోయారని.. ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు మోసం చేస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు ఎక్కడకు వస్తే అక్కడ ఏదో ఒకటి జరుగుతుందని.. ఎన్నారైలు చేతనైతే సాయం చేయాలని.. కానీ చంద్రబాబు ద్వారా చేయవద్దని మంత్రి జోగిరమేష్ కోరారు.
