Jogi Ramesh: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వైఎస్ జగన్ విజయవాడ ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (EPL)-2022 టోర్నమెంట్‌ను మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. డిసెంబర్ 21 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈపీఎల్ టోర్నమెంట్ విజేతకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగామంత్రి జోగి రమేష్ కాసేపు క్రికెట్ ఆడారు. అవినాష్ బౌలింగ్ చేయగా మంత్రి బ్యాటింగ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు వారం ముందే విజయవాడలో మొదలయ్యాయని తెలిపారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దేవినేని అవినాష్ రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి జోగి రమేష్ ఆకాంక్షించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు.
Read Also: Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. తొలిస్థానం ఎవరిదంటే..?
అటు జగనన్న కాలనీలపై టీడీపీ నేత నారా లోకేష్ చేసిన ట్వీట్‌కు మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్‌కు సవాల్ విసిరారు. మాటలు చెప్పడం తమకు రాదని.. దమ్ముంటే ప్రభుత్వం కట్టే జగనన్న కాలనీలకు రావాలని సవాల్ విసిరారు. జనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో చూపిస్తామన్నారు. నారా లోకేష్ పరమ శుంఠ అని.. 17 వేల జగనన్న కాలనీల్లో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్న వ్యక్తులు టీడీపీ నేతలు అని ఆరోపించారు. దేవుడి అండతో అడ్డంకులను దాటుకుని 30 లక్షల మందికి జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగారని పేర్కొన్నారు. 21 లక్షా 20 వేల ఇళ్ల నిర్మాణాల పురోగతిని తాము చూపిస్తున్నామన్నారు. లోకేష్ కళ్లులేని కబోధి అన్నారు. టీడీపీ బ్రతికే ఉంది, తాము కూడా బ్రతికే ఉన్నామని చెప్పుకోవడానికే లోకేష్ ట్వీట్లు పెడుతున్నారని చురకలు అంటించారు.
అటు విజయవాడ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. అందుకే జగన్ పుట్టిన రోజు సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలైన వారికి శాప్ ద్వారా అన్ని రకాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు.