NTV Telugu Site icon

Minister Jayaram: మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తాం

Minister Jayaram

Minister Jayaram

వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలకృష్ణ ఆరోపిస్తున్నారని.. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పనిపడతారని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం జోస్యం చెప్పారు.

Janasena Party: జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన

మరోవైపు మంత్రి జోగి రమేష్ కూడా టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సామాజిక న్యాయభేరి సదస్సుకు జనం రావడం లేదని పచ్చ మీడియా కథనాలు వండి వారుస్తోందని.. వాళ్లు కళ్లు పెట్టి చూడాలని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. తమ బీసీలంటే టీడీపీకి అంత చులకన ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే తాను 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పగలరా అని సవాల్ విసిరారు. పేదవాళ్లకు పథకాలు ఇవ్వడం తప్పని చంద్రబాబు అంటున్నారని.. జగన్ గెలిస్తే బలహీన వర్గాలు గెలిచినట్లేనని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. జగన్ మేలిమి బంగారం లాంటి వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.