NTV Telugu Site icon

Minister Gudivada Amarnath: అది జరిగితే బంగాళాఖాతంలో దూకడం తప్ప మరో మార్గం లేదు…!

Minister Gudivada Amarnath

Minister Gudivada Amarnath

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారంపై రచ్చ సాగుతూనే ఉంది.. ఓవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తుంటే.. మరోవైపు.. వికేంద్రీకరణ జరగాలి.. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న వేళ.. విశాఖ రాజధాని కావాలంటూ.. ఓ ఉద్యమం జరుగుతోంది.. ఈ నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కోసమే జరిగింది.. మళ్లీ అటువంటి తప్పు జరగకుండా చూడాలనే సీఎం వైఎస్‌ జగన్‌ చూస్తున్నారని తెలిపారు.. అయితే, ఏకీకృత రాజధాని వల్ల భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లితే బంగాళాఖాతంలో దూకడం తప్ప మరో మార్గం ఉండదంటూ సంచలన కామెంట్లు చేశారు.

Read Also: YS Jagan Mohan Reddy: మోటార్లకు మీటర్లపై సీఎం సమీక్ష.. చాలా విద్యుత్‌ ఆదా..

మరోవైపు.. తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అమర్నాథ్‌… ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేసిన ఆయన.. దత్తపుత్రుడు, టీడీపీకి వాళ్లకు మద్దతు ఇస్తున్న మీడియాకు ఇప్పుడు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చిందా..? అని నిలదీశారు.. విశాఖ గర్జన నుంచి ప్రజల దృష్టి మల్లించేందుకు తెలుగుదేశం, జనసేనలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.. అభివృద్ధిపై చర్చకు ఎవరు సిద్ధం అయినా సరే.. మేం రెడీగా ఉన్నామని సవాల్‌ విసిరారు మంత్రి అమర్నాథ్‌.. ఇక, తాజాగా విడుదలై.. యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ప్రమోపై సెటైర్లు వేశారు మంత్రి.. ఇటీవల టీడీపీ నుంచి గొప్ప సినిమా విడుదలైంది.. అందులో చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారని ఆరోపించారు.. బావమరిది యాంకర్, బావ, అల్లుడు అతిథులు… తాను తీసుకున్న గ్రేట్ డెసిషన్ అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని మండిపడ్డారు.. ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకున్నానని చెప్పి… కాళ్లు లాగేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Show comments