Minister Gudivada Amarnath: అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు లూటీ చేశారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు అవినీతి వ్యవహారంపై శాసనసభలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. స్లైడ్స్, పీపీటీతో సహా వివరించారు.. అమరావతిలో కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత.. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదు అనుకుంటున్నాడు.. కానీ, చంద్రబాబుపై విచారణ తప్పదు అంటూ హెచ్చరించారు.. దోపిడికి కూడా చంద్రబాబు కోడ్ లాంగ్వేజ్.. ఒక టన్ను అంటే కోటి రూపాయలు.. ఏ అవకాశాన్నీ వదలకుండా ప్రజాధనం లూటీ చేశారు.. సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు నిర్మాణాలు వదల్లేదు అన్నారు. ఐటీ రైడ్స్‌లో లెక్క తేలని రూ.2 వేల కోట్లు బట్టబయలు అయ్యాయి.. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించిందన్నారు. ఇవి ఐటీ శాఖ నివేదికలో వెల్లడైన పచ్చి నిజాలు అని పేర్కొన్నారు.
సంక్షోభంలోనూ బాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్.. ఐటీ శాఖ దేశంలో పలుచోట్ల జరిపిన దాడుల ఫలితంగా రాష్ట్రంలో ప్రజాధనం ఏ విధంగా లూటీ అయ్యిందనేది స్పష్టంగా తెలిసి వచ్చింది. గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు ఏ రకంగా ప్రజా ధనాన్ని దోచుకున్నాడో పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయి. ఆ అవినీతిపై, దోచుకు తినడంలో చంద్రబాబు చూపిన నైపుణ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర విభజన లాంటి సంక్షోభంలోనూ చంద్రబాబు అవకాశాలు వెతుక్కుని ప్రజాధనం లూటీ చేశాడు. ఐటీ రైడ్స్‌లో చాలా విషయాలు బయటపడ్డాయి. దానికి సంబంధించి ఆంగ్ల పత్రికలలో ఆర్టికల్స్ వచ్చాయి.. చంద్రబాబుపై విచారణ చేపడుతున్నారని అందులో రాశారు. సచివాలయం, అసెంబ్లీ, న్యాయస్థానాల నిర్మాణాల్లోనూ చంద్రబాబు దోచుకు తిన్నాడు. 2020 ఫిబ్రవరిలో చంద్రబాబునాయుడి మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ మేరకు ఫిబ్రవరి 13, 2020లో ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. రైడ్స్‌లో రూ. 2 వేల కోట్లు దొరికినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రెస్ రిలీజ్‌లో స్పష్టం చేసింది. 40 చోట్ల తనిఖీలు చేసినట్లు, వాటిలో బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఇన్వాయిస్‌లు, బిల్లులు ఇతర ఆధారాలు లభించాయని, ఇంకా ఒక ప్రామినెంట్ పర్సన్ పర్సనల్ సెక్రటరీ వద్ద ఆధారాలు దొరికాయని చెప్పారు గుడివాడ అమర్నాథ్.
ఇక, చంద్రబాబుకి 2022 సెప్టెంబర్ 28న ఇన్‌కం టాక్స్ నోటీసులు కూడా ఇచ్చిందన్నారు మంత్రి అమర్నాథ్.. ఆయన జీతాలను మాత్రమే ఇన్‌కం టాక్స్‌కి చూపిస్తున్నారు తప్ప మిగిలినవి చూపడం లేదని వారు పేర్కొన్నారు. ఈ కేసును డీసీఏసీ–సెంట్రల్ సర్కిల్‌కి షిఫ్ట్ చేస్తున్నాం అని కూడా నోటీసులో పేర్కొన్నారు. దీని ఆధారంగా చంద్రబాబును భవిష్యత్తులో విచారణకు కూడా పిలుస్తారు. 2019లో మొదలైన ఇన్‌కం టాక్స్ రైడ్స్ చంద్రబాబుకు నోటీసులు వరకూ సాగాయన్నారు.. మరోవైపు ఎన్నికల ఫండ్ కోసం షెల్ కంపెనీలు సృష్టించారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించి ఇన్‌కం టాక్స్ ఒక నివేదిక కూడా తయారు చేసింది. నివేదికలో కీలకంగా డబ్బు చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి డెలివరీ అనే అంశాన్ని ప్రస్తావించారు. దీనిలో కీలకంగా మనోజ్ వాసుదేవ్ పార్ధసానీ అనే వ్యక్తి నిలుస్తున్నాడు. ఇతను షాపోజీ పల్లంజి అనే నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యక్తి.. ఈయనతో చంద్రబాబుకు 2017లో పరిచయం మొదలైంది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో నేరుగా ఇద్దరూ చంద్రబాబు ఇంట్లోనే మాట్లాడుకున్నారు.. అప్పుడు మాకు ఎన్నికలు వస్తున్నాయి.. దానికి ఖర్చులు ఉన్నాయి.. డబ్బు కావాలని చంద్రబాబు అడిగారని.. తన పీఎస్ శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పినట్లుగా చేయాలని చంద్రబాబు మనోజ్ వాసుదేవ్‌కి చెప్పాడు. ఇదంతా ఈ కేసులో జరిగిన విచారణకు సంబంధించిన రిపోర్ట్ అంటూ అసెంబ్లీ చదివి వినిపించారు అమర్నాథ్.
చంద్రబాబుకు చిన్నప్పుడు చదువుకునే రోజుల నుంచి మనుషులు, వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటు. అందులో ఆయన దిట్ట అంటూ ఆరోపించారు మంత్రి అమర్నాథ్.. గత ప్రభుత్వ హయాంలో 2018, డిసెంబర్ నాటికి షాపోజీ పల్లంజీ సంస్థకు మొత్తం రూ.8 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం పనులు కూడా అప్పగించారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి రూ.7 వేల కోట్లు, అమరావతిలో పలు నిర్మాణాలకు సంబంధించి మరో రూ.700 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు. అందుకే, ఎన్నికల సమయానికి రూ.100 కోట్లు పార్టీ ఫండ్ కింద చంద్రబాబు పీఎస్ అడిగినట్లు మనోజ్ వాసుదేవ్ స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌తో పాటు లోకేశ్ పీఏ రాజేశ్ కిలారి అనే వ్యక్తి కూడా ఉన్నారు.. శ్రీనివాస్ విక్కీ జైన్, వినయ్ నంగాలియా అనే ఇద్దరు వ్యక్తులను మనోజ్‌కి ఎటాచ్ చేశాడు.. విక్కీ జైన్, వినయ్ నంగాలియా అనే వ్యక్తుల పేర్ల మీద ఉన్న బోగస్ ఇన్వాయిస్‌లను రెయిజ్ చేసి రూ.52.5 కోట్లు, రూ.62.90 కోట్లు బదిలీ చేశారు.. అతుల్ సోనీ అనే ఎల్ అండ్ టీ ప్రతినిధిని కూడా మనోజ్‌కి ఎటాచ్ చేశారు.. అప్పట్లో ఎల్ అండ్ టీ కూడా సీఆర్‌డీఏలో కొన్ని పనులు చేపట్టింది. ఈ అతుల్ సోనీ అనే వ్యక్తికి రూ.41.90 కోట్లు బదిలీ చేశారు. ఈ డబ్బంతా బోగస్ ఓచర్ల ద్వారా ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికడ్ బలోటాలకు బదిలీ చేశారు అని ఆరోపించారు.. ఆర్వీఆర్ రఘు అనే వ్యక్తి రామోజీరావు కొడుకు కిరణ్ వియ్యంకుడు.. ఇదంతా డీపీటీ(దోచుకో.. పంచుకో.. తినుకో..) బ్యాచ్ కాబట్టి అందరికీ వాటాలు అందించారని పేర్కొన్నారు.
ఇవి కాకుండా దీరమ్స్‌లో కూడా దుబాయ్‌లో రూ.15.14 కోట్లు చంద్రబాబుకు అందించారు అని విమర్శించారు గుడివాడ అమర్నాథ్.. మొత్తం కలిపి రూ.143 కోట్లు ఇలా చేతులు మారింది.. దీనిలో సబ్ కాంట్రాక్టర్లుగా చూపిన కంపెనీలు ఏవీ పనులు చేయలేదు.. ఈ డబ్బును షెల్ కంపెనీలను చూపి దోచుకున్నారు. దాంట్లో చంద్రబాబునాయుడు స్కిల్ ఎక్కువగా ఉంది. వివిధ రూపాల్లో బదిలీ చేసిన డబ్బంతా చివరిగా పీఏ శ్రీనివాస్‌కు చేరిందని మనోజ్ వాసుదేవ్ స్పష్టంగా విచారణలో తెలిపాడు. చేతులు మారిన మొత్తం డబ్బులో రూ.24.90 కోట్లు నిరంజన్‌కి, రూ.3.50 కోట్లు శ్రీనాథ్, రూ.1.82 కోట్లు బెంగుళూరులోని శేఖర్, రూ.4.60 కోట్లు నారాయణ్, రూ.16.51 బెంగుళూరులోని రాజా, రూ.2.7 కోట్లు టీకాస్ట్, రూ.13 కోట్లు అంతా కలిపి రూ.76.09 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబునాయుడు పీఎస్ శ్రీనివాస్ ద్వారానే జరిగింది. ఆర్వీఆర్ రఘు అనే వ్యక్తి వాట్సాప్ చాట్‌లో నారాయణ్ అనే వ్యక్తి వస్తున్నాడని ఉంది. ఆర్వీఆర్ రఘు అనే వ్యక్తి చంద్రబాబునాయుడికి చాలా క్లోజ్ అని కూడా విచారణలో చెప్పారు. ఈ డబ్బంతా చంద్రబాబునాయుడికి అందించడంలో పీఎస్ శ్రీనివాస్ కీలకపాత్ర పోషించాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సందర్భంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విషయాలు చెప్పడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ఇన్‌కం ట్యాక్సు అధికారులు ఆధారాలను సేకరించి అతని ముందు పెట్టారు. మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తితో శ్రీనివాస్ చేసిన చాటింగ్ ఆధారాలు చూపడంతో ఒప్పుకున్నాడు. రాజేశ్ కిలారు అనేవ్యక్తికి రూ.4.5 కోట్లు అందించినట్లు తేలింది. ఈ రాజేశ్ కిలారు అనే వ్యక్తి నారా లోకేశ్‌కి పర్సనల్ సెక్రటరీ కూడా అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్.