Gudivada Amarnath: విశాఖలో రెండో రోజు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజు, ఎమ్మెల్సీలు వంశీ, వరుదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఉగాది నాటికి వైసీపీ కార్యాలయం నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ భవనమే వైసీపీ ప్రధాన కార్యాలయం కాబోతుందని తెలిపారు.
రాష్ట్రానికి భవిష్యత్ విశాఖపట్నం అని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 175 స్థానాల్లో విజయం సాధించాలన్న సీఎం లక్ష్యం నెరవేర్చే ప్రయత్నం విశాఖ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. విశాఖలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు జరగడం సంతోషకరమని.. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా కళలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: Christmas Gift : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.80లక్షల బోనస్
అటు ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, గుంటూరు-విజయవాడ, రాజమండ్రిలో స్వర్ణోత్సవ సంబరాలు పూర్తయ్యాయని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంబించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతం అని.. విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళలు అన్నింటినీ ప్రోత్సహిస్తామన్నారు. మరోవైపు మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పండగలా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి రోజాకు అభినందనలు తెలిపారు.
