ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సోమవారం రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. బుధవారం నాడు మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్లు సమాచారం.
కాగా మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాజకీయ నేతలతో పాటు ఆయన సన్నిహిత వర్గాలకు ఓ షాక్‌గా మారింది. ఎప్పుడూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే మంత్రి గౌతమ్‌రెడ్డి రోజులో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఉదయం, సాయంత్రం జిమ్‌కు వెళ్తారు. గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అలాంటి నేతకు ఉన్నట్లుండి గుండెపోటు వచ్చిందన్న వార్తను ముందుగా ఆయన సన్నిహితులెవ్వరూ నమ్మలేకుండా ఉన్నారు.
