Dharmana Prasada Rao: మూడు రాజధానులు అంశం చాలా విశాల ప్రయోజనాలతో కూడుకున్నది అని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన చట్టం ప్రకారం, శివరామకృష్ణ కమిటీ సిఫారసులనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.. గత ప్రభుత్వం రాజధాని నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బుట్టదాఖలు చేసిందని ఆరోపించిన ఆయన.. పెట్టుబడులు అన్ని ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య చిచ్చు రావడం సహజం అన్నారు.. అందుకే ఈ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.. శివరామ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ ప్రభుత్వం మూడు రాజధానుల అమలుకు సిద్ధం అయ్యిందన్నారు.. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యం అయిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: AP Capitals: రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. అందుకే బుగ్గన అలా..!
మరోవైపు.. మూడు రాజధానులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే సీఎం వైఎస్ జగన్ వైజాగ్ వెళ్తారని తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామని వెల్లడించారు.. విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అసెంబ్లీ అమరావతిలో.. హైకోర్టు కర్నూల్‌లో ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది మేం పెట్టుకున్న పేరు.. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎవరూ అస్పష్టత, అపోహలకు గురి కావద్దు.. వికేంద్రీకరణ అజెండాగానే రానున్న ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఎవరూ అపోహలకు గురి కావాల్సిన పనిలేదు, ఎన్నికలుంటే ఒకమాట, లేకుంటే మరోమాట చెప్పడం వైసీపీ విధానం కాదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే.