NTV Telugu Site icon

Buggana Rajendranath: ఆర్థికమంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా?

Buggana Rajendranath On Bab

Buggana Rajendranath On Bab

Minister Buggana Rajendranath Fires On Chandrababu Naidu: అప్పుల మంత్రి అంటూ తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్థికమంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక్క ఏపీ రాష్ట్రమే అప్పులు చేస్తోందా? అంటూ నిలదీశారు. తాను అప్పుల మంత్రైతే.. యనమల పెద్ద అప్పుల మంత్రా? అంటూ ప్రశ్నించారు. ఆర్థికమంత్రిగా తాను అప్పులు చేస్తానని, మరి పాల వ్యాపారం చేసుకుంటోన్న చంద్రబాబును పాల నాయుడు అని పిలవాలా? అని పేర్కొన్నారు. చంద్రబాబు రౌడీ షీటర్‌లాగా మాట్లాడుతున్నారని.. తన ఇంటిని, జీవితాన్ని కూలుస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. సొంత మామ, బావ మరిది జీవితాలను చంద్రబాబు కూల్చారని దుయ్యబట్టారు. వందేళ్ల క్రితం తన ఊళ్లో కట్టిన ఇంట్లోనే ఉంటున్నానని, నారా వారి పల్లెలో చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏడాదికోసారి తన తల్లిని చూసేందుకు చంద్రబాబు వెళ్తారని, అలా వెళ్లినప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పారు. కేవలం రాష్ట్రం మాత్రమే కాదు.. దేశం, ప్రపంచం కూడా ఇబ్బందుల్లో ఉన్నాయని.. ఆ ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని వివరణ ఇచ్చారు.

చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పాఠశాలలు మూసివేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌ సీఎం అయిన తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగిందని.. కోవిడ్‌ సమయంలోనూ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇస్తే.. జగన్ హయాంలో తాము లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామన్నారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని బాబు అనుకుంటున్నారని మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని.. రాయలసీమలో కోర్టు పెడతామంటే వద్దంటున్నారని పేర్కొన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు, ఇలా అడ్డుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. రాయలసీమకు చంద్రబాబు ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుతో పోలిస్తే తాము తక్కువ అప్పులే చేశామని వెల్లడించారు. గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానంటూ చంద్రబాబు బెదిరిస్తున్నారని, 2019లో ఓడిన తర్వాత కూడా ఇంకా రాజకీయాల్లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పూర్తిగా ఫ్రస్టేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారని మంత్రి బుగ్గన చెప్పారు.