Site icon NTV Telugu

Minister Botsa: మధురవాడ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

Botsa Satyanarayana

Botsa Satyanarayana

విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC స్టేటస్ కో తెచ్చుకుందన్నారు. టీడీపీ హయాంలో ఈ భూముల రెగ్యులరైజేషన్ కోసం టుమెన్ కమిటీని వేసిందని.. వేల్యూషన్ చేయించి NCCకి విక్రయించేందుకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుందన్న NCC రిక్వెస్ట్ ఆధారంగా జీపీఏకు చంద్రబాబు అనుమతి ఇచ్చారన్నారు.

బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే గత ప్రభుత్వంలో ద్విసభ్య కమిటీ నిర్ధారించిన రేటు ప్రకారం NCCకి ఇచ్చేందుకు జీవో నెంబర్ 67 జారీ చేశామని బొత్స వెల్లడించారు. జీవో నెంబర్ 67ప్రకారం మొత్తం భూమి నిమిత్తం 197కోట్ల రూపాయలు NCC కంపెనీ చెల్లించిందన్నారు. ఈ లావాదేవీలు అన్నీ గత ప్రభుత్వం, చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కేటాయింపులు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్నీ జీవోలు అందుబాటులో ఉన్నాయని.. దోపిడీకి ప్రయత్నం చేసి ఇప్పుడు టీడీపీ నాయకులు నంగనాచుల్లా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటాయింపులు జరిగింది NCC వైజాగ్ అర్బన్ డవలపర్స్ కంపెనీకి మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో స్టాంప్ డ్యూటీ నిబంధనలు ఉల్లంఘన జరిగిందా.. లేదా అనేది అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా ప్రాజెక్టు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.

https://ntvtelugu.com/entrance-tests-dates-confirmed-by-andhra-pradesh-higher-education-department/

 

Exit mobile version