ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స మరోసారి స్పందించారు. 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించగా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పొడుగు కావడం కాదు.. కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండి ఎంజాయ్ చేస్తారు కానీ తాము హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టీడీపీ నేతలకు ఎందుకు అభ్యంతరం వస్తుందని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ అడ్రస్ లేని ఓ వ్యక్తి పరిపాలన చేయడం మన దౌర్భాగ్యమన్నారు.
విభజన సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని.. ఈలోగా రాజధాని ఏర్పరచుకోవాలని శివరామకృష్ణ కమిటీని వేసి కొన్ని సూచనలు చేసిందని మంత్రి బొత్స గుర్తుచేశారు. కానీ చంద్రబాబు వీటిని పట్టించుకోకుండా స్వార్ధం కోసం అమరావతిని రాజధాని అని ప్రకటించారన్నారు. స్వలాభం కోసమో, దోపిడీ కోసమో రాజధాని అమరావతి అని చట్టం కూడా చేశారని ఆరోపించారు. ఆ చట్టాన్ని పార్లమెంట్‌కు పంపాలి కానీ ఆ పని చేయలేదన్నారు. దీనిని చెబితే అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా స్పందిస్తారా అంటూ బొత్స మండిపడ్డారు. ఈ వ్యంగ్య భాషల వళ్లే రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి నెట్టేశారని తెలిపారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని బొత్స పేర్కొన్నారు. పార్టీ ఆలోచన ప్రకారం శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో చంద్రబాబు ఎందుకు రాష్టానికి రాలేదని.. హైదరాబాద్‌లో ఉండి పాలన చేశారని.. ఇదేనా వాళ్ల విధానం అంటూ నిలదీశారు.
