Site icon NTV Telugu

Botsa Satyanarayana: ఈ యాప్‌ను విద్యాశాఖలోనే కాదు.. అన్ని శాఖల్లోనూ తీసుకువస్తాం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని.. నిమిషం ఆలస్యం అయితే ఆబ్సెంట్ వేస్తారన్నది వాస్తవం కాదన్నారు. మూడు సార్లు ఆలస్యంగా వస్తే నాలుగోసారి హాఫ్ డే కింద పరిగణించటం పాత నిబంధనే అని గుర్తుచేశారు. ఈ విషయంలో కొత్త నిబంధనలు పెట్టలేదన్నారు. ఫోటో అప్‌లోడ్‌, ఇంటర్నెట్ విషయాలకు సంబంధించి సాంకేతిక సిబ్బందితో మాట్లాడామని.. ఇప్పటికే 50 శాతం మంది ఉపాధ్యాయులు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని మంత్రి బొత్స వివరించారు. మిగిలిన వారు కూడా డౌన్ లోడ్ చేసుకోవటానికి, సాంకేతికంగా అవగాహన చేసుకోవటానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు.

ఈ నెల 27 లేదా 28 తేదీల్లో మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఈ అంశంపై సమీక్షించాలని నిర్ణయించామని మంత్రి బొత్స తెలిపారు. విద్యాశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకుని వస్తామన్నారు. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అనుకుంటే అవసరమైన మేరకు మార్పులు చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వంలో భాగమని.. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కచ్చితంగా అడ్రస్ చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Read Also: Rahul Gandhi: ఇలాంటి రాజకీయాలు చేయడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా..?

అటు ఫ్యాప్టో ఛైర్మన్ యన్.వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఫేషియల్ యాప్, ఇతర యాప్‌లు వద్దని చెప్పామని.. అందులో ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి వివరించారని తెలిపారు. ఫేషియల్ యాప్ వాడేందుకు డివైస్‌లు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ పదిహేను రోజులు యాప్ పరిశీలించి తమ అభ్యంతరాలు చెప్తామని.. పర్యవేక్షణ అధికారులను పెంచకుండా యాప్‌లతో పని తీరు చెబుతారా అని ప్రశ్నించారు. బోధనేతర పనులు తమకు అప్పగించ వద్దని కోరామన్నారు. గతంలో డివైసెస్ ద్వారా హాజరు వేసే వాళ్లమని.. ఇప్పుడు సొంత ఫోన్ల ద్వారా యాప్ వద్దని చెబుతున్నామన్నారు. అధికారులు ఇబ్బందులు పెట్టడం వల్లే కొంతమంది యాప్‌లు ఓపెన్ చేసుకున్నారన్నారు. అటు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ రోజు మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని.. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారన్నారు. అందరికీ డివైస్‌లు కొనాలంటే 200 కోట్ల వ్యయం అవుతుందన్నారు. తమ ఫోన్ల ద్వారానే యాప్ వాడాలని చెప్పారని.. అందరూ పదిహేను రోజుల్లో ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.

Exit mobile version