Ambati Rambabu: ఇక, ఆ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.. నలుగురు ఎమ్మెల్యేలను బేరసారాలు చేసుకునే టీడీపీ అభ్యర్థిని బరిలో పెట్టిందని ఆరోపించిన ఆయన.. ఎమ్మెల్యేలను, మనుషులను సంతలో కొనుగోలు చేసినట్టు చేశారని ఫైర్ అయ్యారు.. తెలంగాణ లో కూడా ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఆఫర్ చేసి.. ఓట్లు వేయించుకున్నారు అని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఒక ఎమ్మెల్సీ గెలిస్తే.. డబ్బులు పెట్టి కొనటం వ్యూహం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబు కుట్ర ఫలించింది.. ఎమ్మెల్యేలు సంతలో వస్తువుల్లా అమ్ముడు పోయి శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రలోభాలకు గురైన వాళ్ళు రేపు బయటకు వచ్చి లబోదిబో మంటారు అని సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు క్షమకు అర్హులు కారన్న ఆయన.. ఓటును అమ్ముకుని దుర్మార్గానికి పాల్పడ్డారు.. ప్రొసీజర్ పాటించకుండా ఎందుకు సస్పెండ్ చేస్తారు అని కోటంరెడ్డి అనటం సిగ్గు చేటు.. పిలిచి బట్టలు పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్ లో ఇంకా ఎక్కువగా మాట్లాడతారు.. ఇక నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు, పార్టీకి సంబంధం లేదు.. వీళ్ళు వెళ్ళి చంద్రబాబు చంక ఎక్కవచ్చు అన్నారు. ఇప్పటికీ చెబుతున్నాం వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇంకా జగన్ వ్యాన్ ఎక్కి ప్రజల్లోకి వెళ్లలేదు.. ఆ రోజు ప్రజలు ఉప్పెనలా ఎలా వస్తారో మీరే చూస్తారు అని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. నలుగురికి టికెట్లు ఉండవని ముఖ్యమంత్రి జగన్ చెప్పటంతోనే వీళ్ళు బయటకు వెళ్ళారన్న ఆయన.. నిన్న కూడా వీరికి టికెట్ ఇవ్వటం సాధ్యం కాదని చెప్పారు.. జగన్ స్ట్రెయిట్ ఫార్వార్డ్ రాజకీయాలు చేస్తారు.. కానీ, మా పక్కనే కూర్చుని, మాతో మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేయటం మోసం కాదా? అని మండిపడ్డారు. చంద్రబాబు డబ్బుకు ఆశపడిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు పశువుల్లాంటి వారు.. వీళ్ళకు పుట్ట గతులు ఉండవని హెచ్చరించారు.. మళ్ళీ అసెంబ్లీలో వీళ్ళు అడుగు పెట్టే అవకాశం లేదని జోస్యం చెప్పారు. ప్రజల్లో వ్యతిరేక వచ్చింది అంటున్నావుగా.. మళ్ళీ వారాహి, దత్త పుత్రుడు ఎందుకు? ఒంటరిగా రాగలవా? సత్తా ఉందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.
