Ambati Rambabu: రాజమహేంద్రవరంలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో కాపులకు సీఎం జగన్ పెద్దపీట వేశారని.. గతంలో కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాపు ఎమ్మెల్యేలను ఇటీవల పవన్ కళ్యాణ్ దూషించడాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం సరికాదని సూచించారు. వంగవీటి రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో కలిసి పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా మరణానికి పవన్ కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అందరూ బాగుండాలని.. అందులో కాపులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో వైసీపీ సర్కారు మరో కొత్త కార్యక్రమం.. త్వరలోనే ప్రారంభం
అటు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. తమ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఎమ్మెల్యే టిక్కెట్ల నుంచి నామినేటెడ్ పదవుల వరకు కాపులకు అన్ని విధాలుగా సీఎం జగన్ పెద్దపీట వేశారని బొత్స అన్నారు. గత ప్రభుత్వాలను కాపులను కేవలం ఓటుబ్యాంకుగానే చూశాయని.. కానీ తమ ప్రభుత్వం కాపుల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. కాపులకు ఇంకా సమస్యలు ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మరోవైపు పీఆర్పీకి ద్రోహం చేసిన వారికి సమాధానం చెప్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్లతోనే స్నేహం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ కించపరుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
