Site icon NTV Telugu

Adimulapu Suresh: ఏపీలో ఆగస్టు 15 తర్వాత ఊహించని పరిణామాలు

Adimulapu Suresh

Adimulapu Suresh

ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని.. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు జ్యుడిషయల్ క్యాపిటల్ వచ్చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. కానీ తాను ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నానని.. అఫీషియల్‌గా అప్పుడే చెప్పకూడదని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయని.. ఏం జరగబోతుందో మీరే చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Read Also:

Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

కర్నూలుకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీలో టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఉందని.. విజిలెన్స్, ఏసీబీ కేసుల ఫైల్స్ చూస్తే 150 కేసుల వరకు ఇవే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ ప్లానర్ ఈ విషయంలో బాధ్యత వహించాలన్నారు. కిందిస్థాయి సిబ్బందిపై నెపం వేస్తే కుదరదని మంత్రి ఆదిమూలపు సురేష్ హితవు పలికారు. ఏపీలో సుమారు 16వేల అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్నారు. అటు ఏపీకి నిధుల సమస్య లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 95 శాతం నెరవేర్చామని.. గత ప్రభుత్వం గ్రాఫిక్స్ చేసిందని.. అమరావతి చుట్టూ అభివృద్ధి అంటూ ఇన్‌సైడర్ ట్రెడింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఓ సామాజిక వర్గానికే అభివృద్ధి జరిగేలా చేశారన్నారు. అందుకే వికేంద్రీకరణ మంత్రంతో అభివృద్ధి, పాలన అన్ని ప్రాంతాలకు అందేలా సమన్యాయం చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కాగా మంత్రి సురేష్ వ్యాఖ్యలతో త్వరలోనే కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుందని తెలుస్తోంది.

Exit mobile version