Site icon NTV Telugu

Cm Jagan: సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతాం

ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. తన సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్ మృతి పార్టీకి, తనకు, రాష్ట్రానికి లోటు అని కచ్చితంగా చెప్పగలనని జగన్ వివరించారు.

వయస్సులో తన కన్నా ఒక్క సంవత్సరం పెద్దవాడైనా తనను అన్న అని గౌతమ్‌రెడ్డి ఆప్యాయంగా పిలిచేవారని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్‌రెడ్డి ఉన్నత చదువులు చదివారని తెలిపారు. తాను సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు గౌతమ్ నిలబడ్డారని.. ఆయన నిలబడటమే కాకుండా అతని తండ్రిని కూడా తనతో నడిపించారని జగన్ పేర్కొన్నారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గానికి తాగునీటిని అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజీ పనులను ఆరు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్ కీలకపాత్ర పోషించారని సీఎం జగన్ తెలిపారు.

Exit mobile version