NTV Telugu Site icon

Mantralayam Hotel Rates: మంత్రాలయంలో హోటళ్ళ నిలువు దోపిడీ

Mantralayam

Mantralayam

మహా పుణ్యక్షేత్రం మంత్రాలయం. కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ప్రత్యేక వేడుకల సందర్భాల్లో లక్షల సంఖ్యలో తరలి వస్తారు. పుణ్యక్షేత్రం వసతి గదులు తక్కువ. అదే ప్రైవేట్ లాడ్జి నిర్వాహకులకు వరంగా మారింది. 12 గంటల వసతికి ఫైవ్‌ స్టార్ హోటళ్లకు మించి డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు వస్తారు. గురు, శని, ఆది వారాల్లో 50 వేల వరకు భక్తులు వస్తారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు , పూర్వ పీఠాధిపతుల సమారాధనకు లక్షల్లో వస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు తరలి వస్తారు. రాఘవేంద్ర స్వామి మఠంకు సంబంధించి సుమారు 600 వసతి గదులు ఉన్నాయి. ప్రైవేట్ లాడ్జీలు 100 ఉండగా వాటిలో 2000 గదులు ఉన్నాయి. 3 స్టార్ హోటల్ ఒకటి, అదే స్థాయిలో మరో హోటల్ వుంది. మఠంకు సంబంధించి వసతి అందరికి లభించే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు.

Read Also: Puri Jagannadh: బ్రేకింగ్.. పూరిని బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్స్.. ఆడియో లీక్

మంత్రాలయంలో వసతి కొరతను అవకాశంగా తీసుకొని సాధారణ గదులకు కూడా భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. రోజుకు 24 గంటలు అయితే 12 గంటలు ఒక రోజుగా పరిగణించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రైవేట్ లాడ్జీలు 24 గంటలకు వెయ్యి రూపాయల వరకు, స్టార్ హోటల్ లో 2 వేలు, 3 వేలు వసూలు చేస్తున్నారు. దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలు, ఆరాధానోత్సవాలు, సెలవు దినాల్లో మామూలు హోటళ్లు 12 గంటలకు 5 వేలు, 8 వేలు, 10 వేలు వసూలు చేస్తున్నారు. మంత్రలయంలోని స్టార్ హోటల్ స్థాయిలో ఉన్న హోటల్ లో సాధారణ రోజుల్లోనూ, పండుగలు, సెలవులు, ఉత్సవాల రోజుల్లో ఒకే ధర వసూలు చేస్తుండగా మామూలు హోటళ్లలో 12 గంటలకు 5 వేలు, 8 వేలు , 10 వేలు వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు ఒక గదికి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు.

మంత్రాలయంలో డబ్బులు చెల్లించగలిగిన వారు 10 వేలు, 20 వేలు చెల్లించి గదులు తీసుకోగలుగుతున్నారు. మిగిలిన వారు ఏ బస్టాండులోనో, మఠం ప్రాంగణంలో రోడ్డుపై విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ లాడ్జీలు భక్తులను దోచుకుంటున్నా నియంత్రించాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. కొందరు నెలసరి మామూళ్లు తీసుకొని మౌనం వహిస్తే మరికొన్ని శాఖలు తమకు ఉచితంగా గదులు ఇస్తే చాలని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు భక్తుల నుంచి దోచుకుంటున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ లాడ్జీల దందా కు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రాలయంలో ప్రైవేట్ లాడ్జీల దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవలని భక్తులు కోరుతున్నారు. ప్రతి లాడ్జీలో ధరల పట్టిక ప్రదర్శించేలా ఆదేశించాలని, నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.

Read Also: Minister Prashanth Reddy: రాజగోపాల్‌ రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదు..