విజయవాడలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లోనే ఉందని.. దీనిపై చంద్రబాబు చొరవ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్యను మందకృష్ణ కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని మందకృష్ణ ఆరోపించారు.
మాదిగలకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ మొదట గుర్తించారని.. ఆ తర్వాత కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని మందకృష్ణ వెల్లడించారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబే ఎస్సీ వర్గీకరణపై చొరవ తీసుకోవాలని కోరారు. కాగా మందకృష్ణ ప్రస్తావించిన అంశాలను టీడీపీ పరిశీలిస్తుందని వర్ల రామయ్య హామీ ఇచ్చారు. కాగా ఈ నెల 27, 28న ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట దగ్గర మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే.