తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కాకి లెక్కలు చెబుతున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడుతున్నారు..
ప్రకాశం జిల్లాలో ఈనెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. గత మహానాడుల కంటే భారీగా టీడీపీ కార్యకర్తలు కార్యక్రమానికి హాజరు కావటం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. దాదాపు మూడు లక్షల మంది వరకూ సభకు హాజరయ్యారని ఇంటెలిజన్స్ నివేదికలు స్పష్టం చేయటంతో అంతకంటే ఎక్కువగానే హాజరై ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ మీద అనుకూలత కంటే వైసీపీ మీద ఎక్కువవుతున్న అసంతృప్తి మహానాడును మరింత విజయవంతం చేసి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధిష్టానం మహానాడు విజయవంతం కోసం భారీగా కసరత్తులు చేయటం.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతల సమిష్టి కృషి వల్ల సభ విజయవంతం అయిందని భావిస్తున్నారు.
టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి మైలేజ్ రావటంతో పాటు జిల్లా టీడీపీకి పునరుత్తేజం లభించింది.. ప్రకాశం జిల్లాలో వైసీపీ కన్నా ఓ అడుగు వెనకుండే టీడీపీకి సభ సక్సెస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది.. మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ ముఖ్య నేతలు విజయం సాధించారు. సభకు ప్రభుత్వం కావాలని ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తలు లెక్కచేయకుండా తరలి వచ్చారని ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలులో సభ జరగటం.. అది భారీ విజయం అందుకోవటం జిల్లా టీడీపీ నేతలకు అనుకోని అవకాశంలా కలసి వచ్చింది.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వైసీపీ కన్నా వెనుకబడి ఉన్న టీడీపీ అక్కడి నుండి కార్యకర్తలను కార్యక్రమానికి తీసుకు రావటంలో విజయవంతం అయ్యింది.
దాదాపు నాలుగు లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. 16వ నంబరు జాతీయ రహదారిపై సభ అనంతరం దాదాపు అర్దరాత్రి వరకూ ట్రాఫిక్ నిలిచి పోయింది. దీంతో మహానాడు విజయం ఖచ్చితంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.. రానున్న ఎన్నికల్లో ఇది తమకు చెప్పుకోవటానికి ఓ మైలురాయిగా నిలిచి పోతుందని భావిస్తున్నారు. జిల్లా గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి నియోజక వర్గాల నుండి భారీగా కార్యకర్తలు తరలి రావటం అక్కడ తమ పార్టీకి లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. మహానాడుపై అధికార పార్టీ నేతలు ఎన్ని అవాకులు.. చవాకులు పేలినా అంతిమంగా ప్రజలు ప్రభుత్వానికి దూరమవుతున్నారంటున్నారు.
ఒంగోలు మహానాడుపై వైసీపీ ప్రకాశం జిల్లా నేతలు కూడా స్పందించారు.. తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించింది మహానాడు కాదని.. మాయనాడు అని ఎద్దేవా చేశారు. మహానాడులో సీఎం జగన్‌ను విమర్శించేందుకే టీడీపీ నేతలంతా సమయాన్ని వెచ్చించారని.. ప్రజలకు మాయమాటలు చెప్పేందుకే చంద్రబాబు మహానాడు ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి.. ఏం చేయాలి.. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని చంద్రబాబునాయుడు ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఫలానా ప్రభుత్వ పథకం వల్ల రాష్ట్రం అప్పులపాలైందని చంద్రబాబు చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వ పథకాలను వారు స్వాగతిస్తున్నారో… వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా జగన్‌ను నిందించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ సంక్షేమ పాలన బాగాలేదని చంద్రబాబు ప్రకటించి.. ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గతంలో ఎన్నికలకు ముందు వైసీపీ ప్లీనరీ సమావేశం పెట్టి నవరత్నాలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లామని.. తెలుగుదేశం మహానాడులో అది ఎక్కడా కనిపించలేదన్నారు. సంక్షేమ పథకాలను వారు ఎలా అమలు చేశారో.. గతంలో ప్రజలంతా చూశారని.. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు పాలనలో ఏం చేశాడో కూడా మహానాడులో చెప్పలేదన్నారు.
రైతులకు జవాబుదారీతనం పెంచేందుకే వ్యవసాయ మోటార్లకు తమ ప్రభుత్వం మీటర్లు పెడుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులు చేస్తున్న బస్సుయాత్రకు ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందన్నారు. జగన్ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నందునే తాము గర్వంగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేయగలుగుతున్నామని జిల్లా వైసీపీ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు అతిగా ఊహించుకుంటే పరాభవం తప్పదన్నారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్దితిలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మహానాడుకు ప్రస్తుతం జరిగిన మహానాడుకు పొంతన లేదని.. గతంలో ప్రజలకు ఏం చేయాలని ఆలోచించే వారని.. ఇప్పుడు సీఎం జగన్ ను తిట్టేందుకే కార్యక్రమాన్ని పెట్టినట్లు ఉన్నారని తెలిపారు.
ఒంగోలు మహానాడును తెలుగుదేశం పార్టీ నేతలు తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీసీ నేతలు మాత్రం మహానాడుతో టీడీపీకి అంత సీన్ లేదంటూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.
Rajya Sabha: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల చిచ్చు.. నగ్మా అసంతృప్తి