శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది ఈవీఎంలతో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ లైవ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. గెలుపు ఏకపక్షమే అయినప్పటికీ ప్రతిపక్షంగా వున్న బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
-
ముగిసిన పోలింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. సాయంత్రం 5:30 గంటల వరకు ఆత్మకూరులో 2.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
-
సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు ఓటు వేసే అవకాశం ఉందన్నారు.
-
ఓటు వేసిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం పోలింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ మందకొడిగా సాగుతోందని తెలిపారు. ఏ.ఎస్ పేటలో పోలింగ్ సరళిని వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పరిశీలించారు.
-
బీజేపీ ఏజెంట్ విష్ణువర్ధన్ రెడ్డి కిడ్నాప్
మర్రిపాడు(మ) కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలోని బీజేపీ ఏజెంట్ విష్ణువర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసిన వైసీపీ నేత మేకపాటి రాజారెడ్డి, ఆయన అనుచరులు. తిమ్మానాయుడు పల్లె వద్ద కారును అడ్డుకుని ఏజెంట్ విష్ణువర్ధన్ రెడ్డిని విడిపించిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్. పోలీసులకు ఫిర్యాదు చేసిన భరత్ కుమార్.
-
తిమ్మానాయుడుపల్లెలో ఉద్రిక్తత
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మర్రిపాడు(మ) తిమ్మా నాయుడు పల్లెలో తొమ్మిదో నెంబర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ లోపల బీజేపీ ఏజెంట్లను బెదిరించిన వైసీపీ అభ్యర్థి బాబాయ్ రాజారెడ్డి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్-రాజారెడ్డి-ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డ బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్.
-
గంటకు 8 శాతం చొప్పున పోలింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 శాతం ఓటింగ్ నమోదయింది. గంటకు సరాసరి 8 శాతం చొప్పున నమోదవుతుది పోలింగ్. ఇదే విధంగా పోలింగ్ కొనసాగితే సాయంత్రానికి 70 నుంచి 80శాతం పోలింగ్ జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
-
ప్రశాంతంగా పోలింగ్...కలెక్టర్ చక్రధర్ బాబు
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా సంగం పోలింగ్ కేంద్రానికి పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు కలెక్టర్ చక్రధర్ బాబు. 141 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం. ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి పరిశీలించి పోలింగ్ స్టేషన్స్ అనుమతి ఇస్తున్నాం. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లు స్ట్రాంగ్ రూమ్స్ కి చేరుస్తాం. కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు .
-
పుంజుకున్న పోలింగ్..45 శాతం నమోదు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలలో పోలింగ్ పుంజుకుంది. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. అనంత సాగరం, ఆత్మకూరు, చేజర్ల, ఏ.ఎస్.పేట.మండలాల్లో కలెక్టర్ తో పాటు ఎన్నికల పరిశీలకుడు సురేష్ కుమార్ పర్యటించారు. పోలింగ్ తీరు పై ఆరా తీశారు. మర్రిపాడు, అనంతసాగరం మండలాలలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇప్పటివరకూ 45 శాతం పోలింగ్ నమోదైందని పోలింగ్ అధికారులు తెలిపారు.
-
అప్పారావు పాలెంలో.. వైసీపీ వర్సెస్ ఇండిపెండెంట్
ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం పోలింగ్ కేంద్రంలో వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్ధుల వాగ్వాదం చోటుచేసుకుంది. భర్తతో కలిసి జెడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి ప్రచారం చేస్తున్నారని ఆందోళన. ఏజెంట్‌గా ఉంటూ ప్రచారం చేస్తున్నారని అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థులు.
-
పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం. మర్రిపాడు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు. పోలింగ్ తీరు...ఈవీఎంల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై ఆరా.
-
11 గంటల వరకూ 25 శాతం పోలింగ్
ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24.92 శాతం పోలింగ్ నమోదు అయింది. ఓటరు కార్డులు వున్నవారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు రాజకీయ పార్టీల నేతల్ని, ఓటర్లను కోరుతున్నారు.
-
పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగుతున్న వివిధ పోలింగ్ స్టేషన్లలో పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. స్థానిక పోలీసులతో పాటు సాయుథ బలగాలను మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వాన పడడంతో టెంట్లు కూలిపోయాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రాలకు 1000 మంది ఓటర్ల ఓటు వేయవచ్చు. ఆత్మకూరు, చేజెర్ల, అనంత సాగరం, సంగం కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల ఓటర్లు తక్కువగా కనిపిస్తున్నారు. వెంగమాంబ జాతర నేపథ్యంలో ఓటర్లు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే ముందుగా ఓటువేసి వెళ్లాలని అధికారులు సూచించారు. పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.
-
పోలీసులతో ఇండిపెండెంట్ వాగ్వాదం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు(మ) బట్టేపాడులో పోలింగ్ బూత్ వద్ద పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఇండిపెండెంట్ అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి. దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది.
-
ఓటేసిన విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మర్రిపాడు (మం) బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. యువుకులు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లను విక్రమ్ రెడ్డి పరిశీలించారు. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు విక్రమ్ రెడ్డి.
Vikram Reddy
-
ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల సమస్య
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకూ11 శాతం పోలింగ్ నమోదు అయింది. ఆరు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించాయి ఈ.వి.ఎం.లు. వెంటనే స్పందించిన అధికారులు కొత్త ఈ.వి.ఎం.లతో పోలింగ్ కొనసాగిస్తున్నారు. పోలింగ్ బూత్ లకు తరలివస్తున్న ఓటర్లతో వాతావరణం సందడిగా వుంది. ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్దులు చూశాకే ఓటర్లను అనుమతిస్తున్నారు.
-
వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఇప్పటివరకూ 11 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారు ఓటర్లు, మరోవైపు ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా వుంది.
-
వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ఏజెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా ఓటర్లు పాల్గొంటున్నారని అధికారులు చెబుతున్నారు.వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు ఓటర్లు. ఉదయం నుంచి యువకుల కంటే మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు పోలీసులు.
-
ఈ నెల 26న ఆత్మకూరు ఫలితాలు
ఈరోజు ఉప ఎన్నిక జరిగే ఆత్మకూరు ఫలితం కోసం ఈనెల 26 వరకూ వేచి వుండక తప్పదు. 26న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. 2019 సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీదే హవా. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులే ఎక్కువమంది గెలిచారు. ఈసారి కూడా విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవంటున్నారు వైసీపీ నేతలు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు కూడా చేశారు.
బారులు తీరిన ఓటర్లు
-
మహిళా ఓటర్లే అధికం
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాలకు కొత్త. మేకపాటి కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే వున్నా విక్రమ్ రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2019లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా వుండడం విశేషం, మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. లక్షకు పైగానే మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువగా వున్నారు.
-
ఆత్మకూరులో బారులు తీరిన ఓటర్లు
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమయింది. సంగం పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు ఓటర్లు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.