నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మద్యం స్కాం బయటపడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. నకిలీ స్టిక్కర్లతో ప్రభుత్వ వైన్ షాపులకు గోవా లిక్కర్ సరఫరా అవుతోంది. కొందరు అక్రమార్కులు గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు.
అయితే ఈ స్కాం వెనుక ఉన్నది ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్‌వైజర్లు అని తెలుస్తోంది. ఈ మేరకు సెబ్ అధికారులు దాడులు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ స్కాంకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సెబ్ అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి ప్రభుత్వ దుకాణాలలో విక్రయిస్తున్న 18 వేల మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సిండికేట్ ముఠా వెనుక ఉన్నవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు హెచ్చరించారు.
