Site icon NTV Telugu

KVP: కేవీపీ సంచలన ఆరోపణలు.. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

Kvp Ramachandra Rao

Kvp Ramachandra Rao

KVP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాణమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ‘పోలవరం-ఓ సాహసి ప్రయాణం’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సదరు పుస్తకంలో కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకుల గురించి అందులో కూలంకుషంగా చర్చించారు. డెల్టా ప్రాంతాలకు, రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆనాడు వైఎస్ఆర్ ఆలోచించారని.. అందుకే ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారని కేవీపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన తీరును కూడా ఆయన వివరించారు. ఈ మేరకు ‘పోలవరం చంద్రబాబు కల అట’ అంటూ ఓ అధ్యాయాన్ని రచించారు. పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నిజంగా పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 1996-2000 మధ్య కాలంలోనే పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యేదని కేవీవీ అభిప్రాయపడ్డారు.

అటు 2014లో రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాగానే ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు పేరులో ఇందిరా పేరును చంద్రబాబు తొలగించినట్లు కేవీపీ తన పుస్తకంలో వెల్లడించారు. ఏపీ విభజన చట్టానికి విరుద్ధంగా పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు చేతిలో పెట్టగానే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన కలగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారని కేవీపీ విమర్శించారు. 1996-2004 మధ్య కాలంలో ఒక్కసారి కూడా పోలవరం ప్రాంతానికి చంద్రబాబు వెళ్లలేదని ఆరోపించారు. 1995లో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినపుడు తూర్పు గోదావరి జిల్లా కడియం ఎమ్మెల్యేగా ఉన్న వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడాదిలోపు ప్రారంభించకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారని పేర్కొన్నారు. పోలవరం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటూ 1996 ఎన్నికల్లో చంద్రబాబు పిలుపునిచ్చారని.. కానీ ఎన్నికలు పూర్తికాగానే ఆయన మాటమార్చేశారని గుర్తుచేశారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే రూ.7వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదన్నారు.

Read Also: RGV : టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు

మరోవైపు పోలవరం ప్రాజక్టులో ప్రధాన డ్యామ్‌ లేకుండానే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని కుడి కాల్వలోకి తరలించడం వల్ల నికర జలాలు నష్టపోతున్నామని కేవీపీ ఆరోపించారు. పట్టిసీమ నుంచి నీటి తరలింపు ప్రారంభం కాగానే కర్ణాటక ప్రభుత్వం తమకు రావాల్సిన 21 టీఎంసీలకు తగ్గట్టుగా ప్రాజెక్టులకు కేటాయించుకుందన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటికి సమానంగా ఎగువన కృష్ణా జలాలు కర్ణాటక తీసుకుంటోందని కేవీపీ తెలిపారు. కర్ణాటక షిగ్గాన్ లిఫ్ట్‌ స్కీం నిర్మాణానికి నీటిని తరలిస్తోందని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే కర్ణాటక నీరు వాడుకోవడానికి చంద్రబాబే కారణమని కేవీపీ విమర్శలు చేశారు. పట్టిసీమ నుంచి నీటి తరలింపు కారణంగా మహారాష్ట్ర సైతం ఎగువ ప్రాంతాల్లో అదనపు జలాలు వాడుకుంటున్నట్లు కేవీపీ వెల్లడించారు.

Exit mobile version