Sugali Preethi Case: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సుగాలి ప్రీతి తల్లి.. సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు తల్లి పార్వతి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం పోరాటం చేస్తున్నా.. 8 ఏళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాను.. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాను.. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదు అన్నారు.. కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు తన కేసును సీబిఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు..
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబు, పవన్ కల్యా్ణ్ గొప్పలు చెబుతున్నారు.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ప్రస్తవిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడారా..? అని నిలదీశారు పార్వతి.. అసలు, పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. పవన్ తన పై, తన కులంపై, తన కుటుంబంపై వారి నాయకుల చేత అనేక ఆరోపణలు చేయించారు.. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తమపై అనేక ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం, జనసేన పార్టీ ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు అనేక ఆరోపణలు చేశారు. తమను కించపరిచే విధంగా తమ పై అనేక కామెంట్లు చేశారు అని మండిపడ్డారు..
ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలో వచ్చిన తరువాత తమను పట్టించుకోవడం లేదన్నారు పార్వతి.. సుగాలి ప్రీతి కేసులో తమకు అన్యాయం జరుగుతుందని నమ్మించి పవన్ కల్యాణ్ నమ్మక ద్రోహం చేశారన్న ఆమె.. న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు గిరిజన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారు అని ఫైర్ అయ్యారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా తమకు కలిసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు పార్వతి.. హైకోర్టులో తాము పిటిషన్ వేశాం, తమకు న్యాయం కోసం వీల్ చైర్ యాత్రను నిర్వహించేందుకు హైకోర్టు ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.. అయితే, ఓజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. “చాలా మంది చాలా చేస్తున్నారు.. ఉసురు తగులుతుంది అని..” నాకు న్యాయం జరగపోతే నా ఉసురు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు తగులుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు..
అన్ని పార్టీలను, అందరు నాయకులను స్వయంగా కలసి విన్నవిస్తా.. వైఎస్ షర్మిల కూడా స్పందించాలన్నారు పార్వతి.. నాకు జరిగిన అన్యాయంపై స్పందించిన వైసీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. వీల్ చైర్ యాత్ర చేస్తానంటే అడ్డుకున్నారు.. చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్ వీల్ చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు.. 16వ తేదీ ప్రధాని మోడీ కర్నూలు వస్తున్నారు.. మోడీని కలసి విన్నవించే ప్రయత్నం చేస్తా… మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించండి అని కోరారు.. మోడీని కలవడానికి అనుమతించకుంటే 13, 14, 15 తేదీలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా.. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి..