CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్

Chandrababu

Chandrababu

CM Chandrababu: కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి చేసిన బంగారాన్ని స్థానిక బంగారు వ్యాపారులకు అందజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా జొన్నగిరి పేరును ఇకపై “స్వర్ణగిరి”గా పిలవాలని ప్రకటిస్తూ, స్వర్ణగిరితో స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సువర్ణ అధ్యాయం మొదలైందని, అందుకు రాయలసీమ కేంద్రంగా మారిందని సీఎం పేర్కొన్నారు. జీవితంలో ఎన్నడూ మరచిపోలేని సంఘటనగా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ప్రారంభాన్ని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిన జియో మైసూర్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు.

జొన్నగిరికి చారిత్రక ప్రాధాన్యం ఉందని పేర్కొన్న చంద్రబాబు, అశోక చక్రవర్తి నాలుగో రాజధాని సువర్ణగిరి ప్రస్తుతం జొన్నగిరేనని తెలిపారు. జొన్నగిరి, ఎర్రగుడిలో అశోకుని శాసనాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమగా వెలుగొందిందని, కోహినూర్ వజ్రం కూడా ఈ నేల నుంచే వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా 400 కిలోల బంగారం ఉత్పత్తితో ప్రారంభమైందని, భవిష్యత్తులో ఏటా ఒక టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో 50 మెట్రిక్ టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని స్వర్ణగిరి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

×
×
Ad

ఆంధ్రప్రదేశ్‌లో పండని పంట, దొరకని ఖనిజం లేదని సీఎం పేర్కొన్నారు. బారైట్స్, గ్రానైట్, సిలికా, బీచ్ సాండ్, ఇనుప ఖనిజం, గ్యాస్, పెట్రోల్, బొగ్గు వంటి సహజ వనరులు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. ఈ వనరుల ఆధారంగా రాష్ట్రంలో సిమెంట్, స్టీల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంటూ, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ల తయారీ, బెంగళూరు-పుట్టపర్తి డిఫెన్స్ కారిడార్, ఓర్వకల్‌లో డ్రోన్ సిటీ, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు వంటి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రస్తావించారు. భవిష్యత్తులో రాయలసీమ విమానాల తయారీ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

కర్నూలులో ముందుగా సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేసి, అనంతరం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాయలసీమలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభించి, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్-1గా నిలబెట్టడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..