Farmer Got Diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్ట దేవత వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం లభించింది. జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న పొలంలో టమోటా పంటను పండించాడు. ఈ సందర్భంగా చేనులో కలుపు తీసే పనులు చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది. ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రం అని స్పష్టమైంది. సదరు వజ్రం 10 క్యారెట్లు ఉన్నట్లు రైతు నిర్ధారణ చేసుకున్నాడు. ఈ వజ్రంతోతన కష్టాలు తీరిపోయాయని రైతు సంబరపడిపోయాడు. ఈ నేపథ్యంలో పెరవలి, జొన్నగిరికి చెందిన కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతును సంప్రదించి రూ.రెండు కోట్ల విలువైన వజ్రాన్ని రహస్యంగా రూ.35లక్షలకు కొనుగోలు చేశారు.
Read Also: Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?
కాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రతి ఏటా తొలకరి తర్వాత వజ్రాల వేట ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పంట పొలాల్లో వజ్రాలు లభిస్తుంటాయి. ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో వజ్రాలు పొలాల్లో పైకి లేస్తున్నాయి.అదృష్టం రూపంలో విలువైన వజ్రం ఆ రైతు తలుపు తట్టడంతో రాత్రికి రాత్రే ఆయన ధనవంతుడిగా మారిపోయాడు. అటు కర్నూలు జిల్లా ఆదోనితో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ఎర్రగుడి,జొన్నగిరి, పెరవలి,తుగ్గలి, గిరిగెట్ల, మద్దికెర, పగిడిరాయి, బసినేపల్లి, అగ్రహారం, రాతన కొత్తూరు, గిరిగెట్ల, అమినాబాద్, రాతన గ్రామాలు వజ్రాల వేట జరుగుతోంది. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సీజన్‌లో స్థానికులు ఆశతో వజ్రాల కోసం గాలింపులు చేపడుతుంటారు. ఒకవేళ అదృష్ట లక్ష్మీ తలుపు తడితే వాళ్ల సంతోషానికి హద్దే ఉండదు.