Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!

Vijaya Dairy

Vijaya Dairy

Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ డైరీ బోర్డు అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి అవసరమైన కోరం సరిపడా లేకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తాజా పరిణామాలపై నిర్ణయం తీసుకునే ముందు విజయ డైరీ ఎండీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయ డైరీ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేసినట్లు వెల్లడించారు. బోర్డు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

కోరం లేకపోయినా రేపు మరోసారి సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చలసాని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల సంస్థ అని, అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటామని చెప్పారు. టీడీపీ నిర్ణయం మేరకే తాను గతంలో పదవి నుంచి తప్పుకున్నానని, ఇప్పుడు కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే పార్టీ అన్ని అంశాల్లోనూ జోక్యం చేసుకోదని, ఎవరినీ ఇబ్బంది పెట్టదని చలసాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తలెత్తిన సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై రేపటి సమావేశంలో స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో విజయ డైరీలో రేపు జరిగే బోర్డు సమావేశం, తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. కాగా, విజయ డెయిరీ బోర్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం విదితమే.. విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. చైర్మన్‌తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయ డైరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు (గన్నవరం)తో పాటు సాయి (ఘంటసాల), పాలడుగు నాని (గన్నవరం), నాగేశ్వరరావు (నందిగామ), శైలజ (మైలవరం) డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఐదుగురు బోర్డు సభ్యులపై పోటీ చేసిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడంతో వారి ఎన్నికల చెల్లుబాటుపై వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు పోటీ చేసిన అభ్యర్థులు అనర్హులని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..