Speaker Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితం, స్పీకర్ బాధ్యతలు, సైబర్ నేరాలు, యువత పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కావడానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడేవాడినని, స్పీకర్ అయిన తర్వాత మాత్రం నోటికి ప్లాస్టర్ వేసినట్టయ్యిందని వ్యాఖ్యానించారు. సభలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం తప్ప గత రెండేళ్లుగా మాట్లాడే అవకాశం లేదని అన్నారు. స్పీకర్ పదవి చాలా బాధ్యతాయుతమైనదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక, టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషమే కానీ, అదే స్థాయిలో నేరాలు కూడా పెరుగుతున్నాయని అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. మనకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు మాయం అవుతోందని, సైబర్ నేరాలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉందని వెల్లడించారు.
Read Also: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ ను తప్పించనున్న మేనేజ్మెంట్..!
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి ఈ కాలేజీకి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న అయ్యన్న పాత్రుడు.. సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కాలేజీ యాజమాన్యం చేసిన మంచి పని అని ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి టెక్నాలజీ అరుదని, సైబర్ క్రైమ్‌పై మొదటిసారి ఈ స్థాయిలో టెక్నాలజీని ఇక్కడ తీసుకువచ్చారని అన్నారు. ఈ విభాగం కోసం కేవీ రావు రూ.1 కోటి 37 లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ వినియోగం భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీస్ శాఖకు టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. టెక్నాలజీ తెలియకపోతే సైబర్ నేరాలను అదుపు చేయడం కష్టమని, పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే, సైబర్ క్రైమ్‌పై ప్రభుత్వం భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సైబర్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.
తాను మొదట రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని, ఎన్టీఆర్‌ను కలిసిన తరువాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామని చెప్పారని వివరించారు. వయసు సరిపోలేదని మొదట తటపటాయించినా, ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. ఎన్టీఆర్ దయవల్ల 8 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు కొంత మేర భ్రష్టుపట్టాయని వ్యాఖ్యానించిన అయ్యన్న పాత్రుడు, యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. యువత తీసుకునే నిర్ణయాలు న్యాయంగా, వేగంగా ఉంటాయని చెప్పారు. ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీని ప్రస్తావిస్తూ, చిన్న పిల్లలు ఎమ్మెల్యేలు, మంత్రులుగా పాత్రలు పోషించారని, వారు తమకంటే కూడా చాలా బాగా వ్యవహరించారని అన్నారు. చిన్న వయసులోనే ఇంత ప్రతిభ కనబరుస్తున్న పిల్లలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
