Site icon NTV Telugu

అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య

కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మదగిన నాయకుడు. రోశయ్య దివంగత నేత వైఎస్ఆర్‌కు ఆప్తుడిగా మెలిగేవారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన.. గుంటూరు నగరంలోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989, 2004లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నర్సరావుపేట నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆర్యవైశ్య కులం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతగా రోశయ్యకు మంచి పేరు ఉంది.

Read Also: బిగ్ బ్రేకింగ్: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య తన సేవలను అందించారు. 2009-10 బడ్జెట్‌తో కలిపి మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. 2009 ఎన్నికల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ఆర్ 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2011, ఆగస్టు 31 నుంచి 2016, ఆగస్టు 30 వరకు 18వ తమిళనాడు గవర్నరుగా రోశయ్య సేవలు అందించారు.

Exit mobile version