మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సీఎం జగన్‌తో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఎవరు కలిసినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. వారిని చెల్లాచెదురు చేయడానికి సింహం రెడీగా ఉందన్నారు. జగన్‌కు ఉన్న 50 శాతంపైగా ఓట్లు అలాగే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుస్తుందని, వైఎస్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి గద్దెనెక్కుతారని జోస్యం పలికారు.
2019 ఎన్నికల్లో మహిళలంతా తనకే ఓటు వేశారని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకత ఉందని చెప్తున్నారని, నిజంగా జగన్‌పై వ్యతిరేకత ఉంటే బాబుకు మరో పార్టీ అవసరం ఎందుకొచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. త్యాగాలు చేయొద్దు, పిండాకూడు చేయొద్దు’’ అంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకి చివరి ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు అధికారం, పవన్‌కి డబ్బు కావాలని నాని ఆరోపించారు. జగన్‌ని ఓడించాలంటే.. ముందు పవన్, లోకేష్ ఎమ్మెల్యేలు అవ్వాలి.. అప్పుడు చూద్దామంటూ సెటైర్స్ వేశారు. చంద్రబాబు, పవన్‌తో ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని కొడాలి నాని చెప్పారు.
