NTV Telugu Site icon

Crop Holiday: గిట్టుబాటు ఎండమావి.. క్రాప్ హాలీడేకి మొగ్గు

Cropholiday

Cropholiday

సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్రాప్ హాలీడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు.

జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో క్రాప్ హాలిడే పాటిస్తారని కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రకటించింది. గత నెలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని…దీనితో దిక్కుతోచని స్థితిలో రైతులు క్రాప్ హాలిడే కు సిద్ధమయ్యారని రైతు పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో తదుపరి పంట వేయడానికి రైతుల వద్ద డబ్బులు లేవని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితులలో రైతులు ఉన్నారని వారు పేర్కొన్నారు.ఇటీవల ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పండించిన పంట అమ్మితే సాగు ఖర్చులు కూడా రావడం లేదని లాభం మాట దేముడెరుగు అని రైతులు వాపోతున్నారు.

పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేక వర్షాలు, తుఫానుల సీజన్ లో వరి చేలు ముంపునకు గురయ్యి పంటను నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి 2552 రూపాయలు ఖర్చు అవుతోందని ప్రభుత్వ నివేదికలలో వెల్లడిస్తూ…రైతుకు మాత్రం మద్దతు ధర క్వింటాలు కు 1910 రూపాయలు ఇస్తున్నారని దీనితో ప్రతీ రైతు క్వింటాలుకు 650 రూపాయలు నష్టం వస్తోందని రైతులు విశ్లేషిస్తున్నారు. గత రబీ లో బొండాలు రకం పండిస్తే కొనేది లేదని అధికారులు ప్రకటించి తమచేత బలవంతంగా 1121 రకం వరి సాగు చేయించారని ఇది దిగుబడి రాక తాము ఎకరానికి 15 వేల రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరిసాగు గిట్టుబాటు కాక 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పట్లో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. జాతీయ స్థాయిలోని 13 పార్టీల నాయకులు కోనసీమ వచ్చి ఇక్కడ క్రాప్ హోలీడే కు దారితీసిన పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మోహన్ కందా కమిటీ ని నియమించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపాలని కోరింది. అయినప్పటికీ నేటికీ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. పంటకు గిట్టుబాటు ధర అనేది అందని ద్రాక్షగానే ఉంది. దీనితో మరోసారి క్రాప్ హాలిడే కు కోనసీమ రైతులు సిద్ధమయ్యారు.

Breaking : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు..

Show comments