Kodali Nani: విజయవాడలో నున్న సెంటర్‌లో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వంగవీటి రాధా పాల్గొన్నారు. వీళ్ల ముగ్గురూ ఒకే వేదికపైకి రావడంతో రాజకీయంగా ఆసక్తి రేగింది. ఈ సందర్భంగా వంగవీటి రంగాపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసమే రంగా జీవించారని.. నమ్మిన సిద్దాంతం కోసం రంగా ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజల గుండెల్లో రంగా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారని కొడాలి నాని కొనియాడారు. 1983లో టీడీపీలో రంగా శత్రువులు చేరారని.. రంగాను భూమి మీద లేకుండా చేయాలనే కుట్ర పన్ని.. హత్య చేశారని ఆరోపించారు. రంగాను హతమార్చిన దుర్మార్గులు ఎంత దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. కుటుంబం కోసం.. డబ్బు కోసం ఆలోచించకుండా రాధా ఓ చిన్న కుటీరం వేసుకుని ఉంటున్నారని కొడాలి నాని అన్నారు. రాధా అడిగితే.. వేయి ఇళ్లు ఖాళీ చేసి ఇస్తారని.. కానీ రాధాకు స్వార్ధం లేదన్నారు. తండ్రి పేరు నిలబెట్టడమే తనకు ముఖ్యమని రాధా అంటారని.. డబ్బులిస్తామన్నా.. రాజ్యసభ లాంటి పదవులిస్తామన్నా వంగవీటి రాధా లొంగడని కొడాలి నాని స్పష్టం చేశారు.
Read Also: Uttar Pradesh: మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. చివరకు కరెంట్ షాక్‌తో చంపిన భర్త
రంగా ఓ ప్రాంతానికో.. కులానికో.. పార్టీలకో పరిమితం కాదని వంగవీటి రాధా అన్నారు. అందుకే పార్టీలేమైనా.. ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. రంగా చనిపోయి 34 ఏళ్లు అవుతున్నా.. తమ నాయకుడు రంగా అనే చెబుతారని.. రంగా హత్య జరిగిన సమయంలో పుట్టని వారు కూడా రంగాను తమ నాయకుడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పదవిలో ఉన్నామని కాదని.. ప్రజల గుండెల్లో ఎన్నాళ్లు నిలిచామనేదే ముఖ్యమని వంగవీటి రాధా స్పష్టం చేశారు. పదవులు గురించి కొడాలి నాని ఏదో చెప్పారని.. పదవులు ఐదేళ్లు ఉంటాయి.. ఆ తర్వాత పోతాయని.. రంగా గారి అబ్బాయినేదే తనకు పెద్ద పదవి అన్నారు. ఓ సామాన్యుడిగా అందరితో కలిసి ఉండడమే తనకు ఇష్టమన్నారు.
అటు వంగవీటి రంగా చనిపోయి 34 ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నారని వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పేదల స్థలాల కోసం దీక్ష చేస్తున్న రంగాను దారుణంగా చంపారని.. రంగా హత్యానంతరం 15 రోజుల పాటు రాష్ట్రం అల్లకల్లోలం అయిందంటే ఆయన ప్రభావం ఏంటో అర్థం అవుతోందన్నారు. పేదలకు సేవ చేసేందుకు రంగా బాటలో నడవాలని పిలుపునిచ్చారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రంగా అని.. రంగా శక్తి ఎలాంటిదో.. ఆనాడే అందరికీ అర్థమైందన్నారు. వంగవీటి రాధా భవిష్యత్తులో మరింత మంచి పదవులను అలకరించాలని కోరుకుంటున్నట్లు బాలశౌరి తెలిపారు.
రంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు తాను, కొడాలి నాని చిన్న వాళ్లమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. రంగా పేద ప్రదల మనిషి అని.. మూడేళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న రంగా ఎంతో ఖ్యాతి సంపాదించారన్నారు. అందుకే రంగా చనిపోయి 35 ఏళ్లైనా ప్రజల్లో జీవించే ఉన్నారని.. రాధా కూడా తన తండ్రి రంగా బాటలోనే పయనిస్తున్నారని కొనియాడారు.
