NTV Telugu Site icon

కమ్మ-కమ్మ కొట్టుకుంటుంటే.. వాళ్లెవరు మధ్యలో : కొడాలి నాని

గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారని ఆరోపణలు చేస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం అలాంటిది ఏం లేదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నిజానిజాలు తేల్చుకునేందుకు గుడివాడకు వెళ్లగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆ ఘటన తరువాత నిజ నిర్దారణ కమిటీ సభ్యుల్లో ఒకరైన బాణా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షల్ లో ఎలాంటి తప్పు జరగకుంటే ఎందుకు మాకు సహకరించలేదంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై మంత్రి కొడాలి నానిని ఎన్టీవీ వివరణ కోరగా.. కొందరు కులపిచ్చి నాయకులు చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చి తమ అక్రమాలను సాగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆనాడు వీరిని నమ్మిన ఎన్టీఆర్ కు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇప్పుడు గుడివాడలో నాపై కూడా ఆరోపణలు చేసి కించపరచాలనుకుంటున్నారన్నారు. గుడివాడలో కమ్మ-కమ్మ లకు జరుగుతున్న సమస్యని.. అందులో బోండా ఉమా లాంటి వారు.. చంద్రబాబు ఆడుతున్న ఆటలో పావులు మాత్రమేనని కొడాలి నాని వ్యాఖ్యానించారు.