పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార, విపక్ష నేతల మధ్య తారాస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని.. తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈ అక్రమ అరెస్ట్ వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు.
గత మూడేళ్ళ నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉన్న నారాయణపై తమకు కక్ష సాధించాల్సిన అవసరం ఏముందని నాని ప్రశ్నించారు. ఆయన జగన్‌కు వ్యతిరేకంగా దూకుడు రాజకీయాలేమైనా చేస్తున్నారా? లేక యుద్ధాలు నడుపుతున్నాడా? లేదు కదా.. మరి ఆయన్ను టార్గెట్ చేయాల్సిన అవసరమేంటని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వాళ్ళని ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారుపై బురద చల్లేందుకు పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని విమర్శించారు. పరీక్ష మొదలైన కాసేపటికి ప్రశ్నాపత్రాలను ఫొటోల రూపంలో బయటకు పంపి, ఆ తర్వాత లీకైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సిగ్గు లేకుండా టీడీపీ నేతలు తాము చేసిన తప్పుల్ని సమర్థించుకుంటున్నారని నాని అన్నారు. జగన్ ను దించడానికి అత్యాచారాలు, హత్యలు, పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. ఇవన్నీ చూస్తూ మేము ఊరికే కూర్చోవాలా? అంటూ కోపాద్రిక్తులయ్యారు. “వీళ్లే గుళ్ళు పగలగొట్టి, వీళ్లే ఆందోళనలు చేస్తారు… వీళ్లే మర్డర్లు, మానభంగాలు చేస్తారు… వీళ్లే స్టేట్మెంట్లు ఇస్తారు. జగన్‌ను పదవి నుంచి దించడానికి రేపులు చెయ్యాలా?’’ అంటూ ఫైరయ్యారు. చేతనైతే జగన్ కంటే మేము మంచి పని చేస్తామని ప్రజలకి చెప్పుకోండని, నీచ రాజకీయాలకు విద్యార్థుల్ని బలి చేయొద్దని కొడాలి నాని హితవు పలికారు.
