Kodali Nani Fires On Pawan Kalyan and Chandrababu Naidu: తనని ప్యాకేజ్ స్టార్ అని పిలిస్తే చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రహ్మానందం డైలాగులు వదిలి.. సక్రమమైన మార్గంలో వెళ్లాలని పవన్‌ని సూచించారు. పవన్ సిగ్గులేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నాడని.. అందుకే ప్రజలతో పాటు తాము కూడా ‘పీకే’ని ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు కోసం పవన్ చిల్లర వేషాలు వేస్తున్నాడని చెప్పిన కొడాలి నాని.. పవన్ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు.. దాచిన ఆ చెప్పుతో తాను కొట్టుకోవడంతో పాటు తనకు ఆ స్థితికి కారణమైన చంద్రబాబుని కూడా కొట్టాలని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఏర్పడిందని.. పవన్‌కు కాపులు, ప్రజల కంటే సీఎం జగన్‌ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యమని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు కలిసొచ్చినా.. జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని తేల్చి చెప్పారు. పవన్‌కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజే ముఖ్యమని.. విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్‌ను చంద్రబాబు వైజాగ్ పంపారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే మా మంత్రులను బూతులు తిడుతూ.. జనసేన నేతలు దాడులకు దిగారన్నారు. ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా.. ఇతర పార్టీకి మద్దతు తెలిపిన ఏకైక పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు, చంద్రబాబుకి పవన్ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడని.. చంద్రబాబుని సీఎం చేయడమే పవన్ లక్ష్యమని కొడాలి నాని చెప్పారు.
