Kodali Nani Fires On Chandrababu Pawan Kalyan: తెలుగుదేశం పార్టీపై తనకు ఏమాత్రం అభిమానం లేదని.. జూ. ఎన్టీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. హరికృష్ణ తనను రాజకీయాల్లోకి తీసుకొస్తే.. తారక్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని చెప్పారు. అమరావతి రైతుల ముసుగులో తారక్‌ను తిట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని.. ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట వాళ్లు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఆ ఇద్దరికి గుణపాఠం చెప్పాలని కోరారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని.. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఘోరంగా ఓడించాలని అన్నారు.
చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు అని.. అలాంటి ఎన్టీఆర్‌ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదని, చంద్రబాబుని నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పని పేర్కొన్నారు. అయితే.. తనకు ఎన్టీఆర్ కుటుంబంపై విశ్వాసముందని అన్నారు. కేవలం తోడు కోసమే లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని.. ఆమెకు ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదని చెప్పారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని.. రుషికొండను తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ప్రభుత్వ స్థలమని, అక్కడ నిర్మిస్తోంది కూడా ప్రభుత్వ కార్యాలయమేనని, మరి అందులో కుంభకోణం ఎక్కడుందని నాని నిలదీశారు. హైదరాబాద్‌లో కొండలు తవ్వి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లు కట్టుకోలేదా? అని ఈ సందర్భంగా కొడాలి నాని ప్రశ్నించారు.
