NTV Telugu Site icon

Kodali Nani: ఎన్టీఆర్ ప్రజా నాయకుడు.. ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చు

Kodali Nani

Kodali Nani

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.. ఆయన ఏ పార్టీకి చెందినవారు కాదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అని నిలదీశారు. బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది తానేనని.. టీడీపీ వాళ్ళే తన పేరు తీసేసే ప్రయత్నం చేశారని కొడాలి నాని ఆరోపించారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగులైనా వేసుకోవచ్చన్నారు. చంద్రబాబు వస్తాడు.. వెళ్తాడని.. తన చిన్నప్పటి నుంచి గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని.. తనను ఓడించినా, గెలిపించినా గుడివాడ నియోజకవర్గ ప్రజలే చేయగలరని కొడాలి నాని అన్నారు. సొంత కొడుకునే గెలిపించలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు.

Read Also: Nellore District: బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడి దాష్టీకం

మరోవైపు ఈ సమావేశంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి గుడివాడలో పోటీ చేసినా విజయం కొడాలి నానిదే అని ధీమా వ్యక్తం చేశారు. కొడాలి నాని ఎంతో ప్రజాభిమానం సంపాదించారని, ప్రతిసారి మెజార్టీ పెరుగుతోందని కొనియాడారు. రానున్న ఎన్నికల్లోనూ కొడాలి నాని ఎమ్మెల్యే అవుతారని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ బాలశౌరి జోస్యం చెప్పారు. అటు ఎంత మంది వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నానిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకుని వెళ్లాలనుకున్నానని.. కొడాలి నాని తన స్నేహితుడు అని చెప్పుకోవటానికి జీవితాంతం గర్వపడతానని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు అని పేర్ని నాని ప్రశంసలు కురిపించారు.