NTV Telugu Site icon

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు..

YS Viveka

YS Viveka

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్య కేసులో విచారణ చాలా కాలం ముందుకు సాగడంలేదనే విమర్శలు వచ్చాయి.. అయితే, ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి.. ఆ కేసు పర్యవేక్షణ అధికారి సుధాసింగ్‌ను మార్చేసింది సీబీఐ.. ఈ మార్పు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాచ్‌మాన్‌ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు సీబీఐ అధికారులు.. ఇక, న్యాయమూర్తి సమక్షంలో రంగయ్య ఇచ్చిన వాగ్మూలంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. వైఎస్‌ వివేకాది హత్యేనని.. రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారని.. హత్యలో ఏడుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వాగ్మూలం ఇచ్చారు రంగన్న.. ఇక, వాగ్మూలం తీసుకున్న తర్వాత శుక్రవారం రాత్రి పులివెందుల బస్టాండ్ లో రంగన్నను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోయారు సీబీఐ అధికారులు.. అయితే, ఆయనను అలా వదిలివెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు.. రంగన్న వాగ్మూలం ఇచ్చిన పేర్లలో వైఎస్‌ వివేకాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఎర్ర గంగిరెడ్డి పేరు కూడా ఉంది.. తన పేరు చెబితే చంపుతానని గంగిరెడ్డి బెదిరించినట్లు మెజిస్ట్రేట్ సమక్షంలో రంగన్న వాగ్మూలం ఇచ్చారు.. ఇదిలా ఉంటే మరో వైపు విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ హైకోర్టులో నలుగురు పిటిషన్లు దాఖలు చేశారు.. వివేకా హత్య కేసులో తొందర పాటు చర్యలు, అరెస్ట్ చేయకుండా చూడాలంటూ సునీల్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.. సీబీఐ డైరెక్టర్ ను ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు.. విచారణ అవసరమైతే న్యాయమూర్తి సమక్షంలో విచారించేలా ఆదేశించాలని పేర్కొన్నాడు సునీల్ కుమార్ యాదవ్.. డిప్యూటీ సూపరింటెండెంట్ సూచలన మేరకు విచారణలో థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు.. ఇక, రంగయ్య ఆరోపణలు గంగిరెడ్డి ఖండించారు.. నన్ను ఎంతో బాగా చేసుకున్న వివేకాను తాను ఎందుకు హత్య చేస్తానని ప్రశ్నించారు.. అసలు రంగయ్యే తనకు తెలియదని.. నేను ఆయన్ను ఎందుకు బెదిరిస్తానని ప్రశ్నించారు.. ఇలా.. రెండు రోజుల వ్యవధిలోనే వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.