NTV Telugu Site icon

KCR Next Target: విశాఖపై కేసీఆర్ ఫోకస్. బీఆర్ఎస్ మలిసభ అక్కడేనా?

Cm Kcr Target vizag

Cm Kcr To Address Brs Massive Public Meeting In Khammam On Jan 18

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఖమ్మంలో తొలి సభను నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. మలి సభను ఏపీలోని విశాఖపట్నంలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ మహాసభ సక్సెస్ అయిందా? ఆయన లక్ష్యం నెరవేరిందా? ఆయన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ? అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు కారణం అవుతోంది. తొలుత ఢిల్లీలో ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ భావించారు. కానీ ఆ సభను ఖమ్మంకు మార్చడం వెనుక వేరే కారణాలు వున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక ఏదోక వ్యూహం ఉంటుంది. కేసీఆర్ వేసే ఎత్తులు, పైఎత్తులు ఎవరికీ అర్థం కావు అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించడం వెనుక కూడా మాస్టర్ ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

Read Also: Minister KTR : తెలంగాణ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ ఎకోసిస్టమ్‌ను ప్రపంచ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి

ఏపీకి సరిహద్దులో సభ నిర్వహించడం ద్వారా ఏపీ నేతలకు సంకేతాలు వెళ్లాయంటున్నారు. త్వరలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చేరికలు ఊపందుకున్నాయని అన్నారు. తమ పార్టీలోకి వచ్చేందుకు పెద్ద పెద్ద లీడర్లు తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ మొట్టమొదటి సభ వైజాగ్ లో ఉండే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్ వంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా హాజరయ్యారు. ముగ్గురు సీఎంలు, ఒక మాజీ సీఎం, వామపక్షనేతల్ని పిలిచి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇటీవల బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఏపీలో పార్టీ విస్తరణ కోసం సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకుగాను ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశాఖలో సభావేదిక ఏర్పాటు, నిర్వహణ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి భారీ చేరికలు ఉంటాయని ఇటీవల కేసీఆర్‌ ప్రకటించారు. ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాల నుంచి 70 మందికి పైగా నాయకులు కేసీఆర్‌ను కలిసి, స్థానికంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. విశాఖలో చేపట్టనున్న బహిరంగ సభ ద్వారా దేశంలో పాజిటివ్ మార్పు సందేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. ఏపీ తర్వాత మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక నుంచి కూడా చేరికలు ఉంటాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత అడుగు కర్ణాటక వైపే ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా టైం ఉన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లోపు బీఆర్ఎస్ ని పటిష్టం చేయాలని ఏపీ వైపు దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

Read Also: AP State Finance Commission: ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు హామీ ఏమైంది?