Pawan Kalyan: ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. మరో వైపు పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో బలోపేతం, శ్రమించిన వారికి గుర్తింపు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం పిఠాపురంలో పార్టీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే, గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్‌ను రెండు నెలల క్రితం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
Read Also: Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి
అయితే, గత కొంత కాలంగా మర్రెడ్డి పై పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ పనితీరుకు ఆటంకంగా మారిన అంశాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ మరో కీలక చర్య తీసుకున్నారు. దీంతో మర్రెడ్డిని ఫైవ్ మెన్ కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మర్రెడ్డి స్థానంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న, చేబ్రోలు ప్రాంతంలో జనసేన పార్టీ సమావేశాలు, కార్యకర్తలకు నివాసం, వసతి వంటి సౌకర్యాలు అందించిన ఓదూరి కిషోర్‌ను కొత్త సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పిఠాపురంలో పార్టీ ఆర్గనైజేషన్ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే ఎన్నికలకు ముందు జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు జనసేన నేతలు..