సాంప్రదాయ ఇంధనాల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి పెద్ద ముప్పు ఏర్పడింది. కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రీన్ ఎనర్జీనే భవిష్యత్తుగా ప్రపంచం గుర్తిస్తోంది. ఈ మార్పులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఎక్కడ ఉన్నా మన జన్మభూమిని మర్చిపోకూడదు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. జల్లికట్టు, ప్రభలతీర్థ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి దాదాపు మూడు లక్షల కార్లు వచ్చాయి. మొత్తం మీద 30 లక్షల మందికి పైగా రాష్ట్రానికి తరలివచ్చారు. గ్రామాల్లో కోడి పందాలు జోరుగా సాగాయి. ఇది మన సంప్రదాయాల బలాన్ని చాటిచెప్పింది.
Read Also: Rohan : బంపర్ ఆఫర్ కొట్టేసిన బుడ్డోడు.. ఏకంగా చిరంజీవితో!
సాంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కావడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు సీఎం చంద్రబాబు. కాకినాడ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. ఇక్కడ తయారయ్యే గ్రీన్ అమ్మోనియాను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కార్యాచరణ సిద్ధం చేశారు. భవిష్యత్తులో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
దేశంలో పవర్ సెక్టార్ సంస్కరణలను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొచ్చింది అన్నారు చంద్రబాబు. ఏపీకి ఉన్న విస్తారమైన తీరప్రాంతం మరే రాష్ట్రానికి లేదన్నది ప్రత్యేకత. రాష్ట్రంలో 20 పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ‘సూర్యుడు ఏపీలో ఉదయించే పరిస్థితి తీసుకొస్తాం’ అన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది దేశంలోనే ఉత్తమ పాలసీలలో ఒకటిగా నిలవనుంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
కాకినాడ హోప్ ఐలాండ్‌ను కేంద్రంగా చేసుకుని స్పేస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. శాటిలైట్ సిటీ అభివృద్ధి కూడా ప్రణాళికలో ఉంది. 2026 నాటికి రాష్ట్రంలో డ్రోన్ అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చనున్నాయి అన్నారు చంద్రబాబు.. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అనిల్ నిలబడగలిగాడని, పవన్ కళ్యాణ్ అండగా ఉండటం రాష్ట్రానికి అదృష్టమని సీఎం పేర్కొన్నారు. తాను నిత్య విద్యార్థినని, కొత్త విషయాలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటానని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయాల పరిరక్షణ, ఆధునిక అభివృద్ధి — ఈ మూడు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశగా దూసుకెళ్తోంది అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
