తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎస్‌ఈసీ అధికారులు ఎన్నికలను ఇవాళ నిర్వహించారు. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. గతంలో మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు.కాకినాడ మేయర్ గా 40 వ వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.
Read Also:కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు.
ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ సుంకర పావని, ఉప మేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. దీంతో పావని పదవిని కోల్పోయారు.