Visakhapatnam: విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్ర కోసం విశాఖపట్నం వచ్చారు. మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో కొండపై నుంచి ఘాట్ రోడ్డు దిగుతుండగా బస్సు బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. ఆ సమయంలో బస్సులో 37 మంది ఉండగా, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే గాయాలయ్యాయి. వెంటనే వారిని విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద విషయం తెలియగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి విశాఖపట్నం, కాకినాడ జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురం విద్యార్థులని తెలియగానే ప్రమాద వివరాలు, అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల కండిషన్‌పై రవాణా శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని, విహార యాత్రలకు పిల్లలను తీసుకెళ్లే ముందు బస్సుల బ్రేకులు, ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఆయన అధికారులకు సూచించారు.
మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై విశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పడంతో, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దూర ప్రాంతాలకు, విజ్ఞాన యాత్రలకు పిల్లలను తీసుకెళ్లేటప్పుడు వాహనాల ఫిట్నెస్ను తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలని, ఘాట్ రోడ్లపై అనుభవం, నైపుణ్యం ఉన్న డ్రైవర్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు లోకేష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

