Site icon NTV Telugu

ATM Cash Robbery: ఏటీఎం క్యాష్ కొట్టేశాడు.. భయంతో కారులోనే డబ్బు వదిలి పారిపోయాడు

Atm Cash Robbery

Atm Cash Robbery

ATM Cash Robbery: కడప జిల్లాలో ఏటీఎం క్యాష్ చోరీ స్థానికంగా కలకలం రేపింది. కడపలోని పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలు అధికారులు సీఎంఎస్‌ సంస్థకు అప్పగించారు. అయితే ఈ నెల 16న కడప నగరంలోని ఏటీఎంలలో రూ.71 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. ఈ మేరకు సీఎంఎస్ యోధ వాహనంలో క్యాష్‌ కస్టోడియన్‌ సునీల్‌తో పాటు మహేంద్ర రెడ్డి లోహియానగర్‌లోని ఓ ఎస్‌బీఐ ఏటీఎంలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనం డ్రైవర్ షేక్ ఉమర్ ఫరూక్ ఏటీఎం క్యాష్ బాక్సుతో ఉడాయించాడు. దీంతో సిబ్బంది కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాష్ బాక్సులో రూ.56 లక్షల నగదు ఉందని వారు వివరించారు.

Read Also: Vidadala Rajini: ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు

ఏటీఎం క్యాష్ కస్టోడియన్‌ మంత్రి సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. వాహనంలో ఉన్న జీపీఎస్‌ లోకేషన్ ఆధారంగా పోలీసులు వినాయక నగర్‌లో ఓ కార్‌ షెడ్డులో క్యాష్‌ వ్యాన్‌ను గుర్తించారు. అయితే అందులో నగదు బాక్సు మాత్రం లేదు. ఈ కేసులో ఫరూక్‌కు మహబూబ్ బాషా అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫరూక్‌ మొబైల్ నంబర్‌ ఆధారంగా అతని కదలికలను గుర్తించారు. కడప పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను తనిఖీ చేయడంతో డ్రైవర్ ఫరూక్ పులివెందుల వైపు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో అనంతపురం, కర్ణాటక సరిహద్దుల్లో టోల్ గేట్ల వద్ద వాహనాలను పోలీసులు పరిశీలిస్తుండగా షేక్ ఫరూక్ గమనించి తన వాహనాన్ని వదిలి పారిపోయాడు. టోల్ గేటు అధికారుల సహకారంతో కడప పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న రూ.53.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు మహబూబ్ బాషా బంధువులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version