Site icon NTV Telugu

Jogi Ramesh: సినిమా స్టైల్‌లో చంద్రబాబు నాటకాలు వేస్తున్నారు

Jogi Ramesh On Babu

Jogi Ramesh On Babu

Jogi Ramesh Fires On Chandrababu Naidu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమా స్టైల్‌లో జనం ముందు నాటకాలు వేస్తున్నారని మంత్రి జోగి రమేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజలను కాటు వేసేలా ఉన్నాయని మండిపడ్డారు. సీఎంగా తానేం చేశానో చెప్పుకుని ఓట్లడగటం సహజమని.. కానీ అలాంటిదేమీ లేకుండా చంద్రబాబు జనాన్ని కాటు వేస్తున్నారని విమర్శించారు. 86 నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కేలేదని వారి సొంత సర్వేలోనే తేలిందన్నారు. గతంలో ఏవైనా మంచిపనులు చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారని.. అవి చేయకపోవడం వల్లే 23 సీట్లకు దించేశారని ఎద్దేవా చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ ‘ప్యాకేజీ’ కోసం ఎన్ని డ్రామాలైనా చేస్తాడని జోగి రమేశ్ కౌంటర్ వేశారు. బీసీల్లో 82 వేల మందిని సీఎం జగన్ లీడర్లుగా తయారు చేశారని.. రాష్ట్రమంతా జయహో బీసీ, జయహో జగనన్న అనే నినాదం మార్మోగుతోందని జోగి రమేశ్ పేర్కొన్నారు. లోకేష్ ఒక రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి అని.. అందుకే ఇష్టానుసారం ట్వీట్లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు, భద్రతలో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే, దానిమీద కూడా విమర్శలు చేయటం ఒక్క లోకేష్‌కే చెల్లిందన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి చంద్రబాబు, లోకేష్ అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చికుక్కల్లాగా జనాన్ని కాటు వేస్తున్నారని.. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని తేల్చి చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా.. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

ఇదే సమయంలో.. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేష్ పాత్ర కూడా ఉందని జోగి రమేశ్ బాంబ్ పేల్చారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని, అందరి తప్పులూ బయటకు వస్తాయని అన్నారు. వారిద్దరు కూడా జైల్లోకి పోవడం ఖాయమన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని.. చంద్రబాబు చేస్తోందని విష ప్రచారమని ప్రజలే తిట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.

Exit mobile version