NTV Telugu Site icon

జవాద్ తుఫాన్ టెన్షన్.. విద్యుత్‌ పంపిణీ సంస్థకు ముప్పు..!

దూసుకొస్తున్న జవాద్‌ తుఫాన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది… తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు జవాద్ తుఫాన్ టెన్షన్ పట్టుకుంది.. గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు… ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఇక, సమస్య తలెత్తిన సబ్ స్టేషన్లు, ఫీడర్లు మరమ్మత్తు కోసం ప్రత్యేక బృందాలు నియమించారు.. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడానికి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు.

Read Also: 30 దేశాలను తాకిన ఒమిక్రాన్‌.. యూతే టార్గెట్..!

కాగా, ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం మరింత బలపడి ఇవాళ మధ్యాహ్యానికి బంగాఖాళాతంలో జవాద్‌ తుఫాన్‌గా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందంటున్నారు. జవాద్‌ ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఇవాళ అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.