Site icon NTV Telugu

బద్వేల్‌ బై పోల్.. బరిలోకి జనసేన..?

బద్వేల్‌ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్‌ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేయగా.. మరోవైపు.. పరిషత్‌ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి.. గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో.. బై పోల్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ని బద్వేల్‌ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక, జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిపై కూడా త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్టుగా తెలుస్తోంది.. బై పోల్‌ బరిలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థియే ఉంటారని ప్రచారం సాగుతోంది.

బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ అంశంపై సమన్వయ కమిటీలో చర్చించనున్నారు బీజేపీ-జనసేన పార్టీకి చెందిన నేతలు.. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసింది కాబట్టి.. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని జనసేన నేతలు కోరే అవకాశం ఉందంటున్నారు.. బుధవారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీకానున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ అంశంపై కడప జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకోనున్న ఆయన.. వారి అభిప్రాయాలు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోటీపై నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. తిరుపతి ఎన్నికల తర్వాత జనసేన-బీజేపీ మధ్య కాస్త గ్యాప్‌ పెరిగిందనే ప్రచారం కూడా ఉంది.. మరి.. బద్వేల్ బై పోల్‌ సమయంలో.. దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version